పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

47


వ్యక్తమవుతూంది. నూతన ఆవిష్కరణలకోసం కృషిచేసిన శాస్త్రజ్ఞుల జీవితాలకు, నరసయ్య జీవితానికి చాలా పోలికలు కనిపిస్తాయి. ఆయన చేసిన ఈ రెండో ప్రయత్నమూ కొనసాగలేదు.

ఒంగోలు వెంకటరంగయ్య నరసయ్యను, నంబెరుమాళ్ళయ్యను “ఇద్దరాంగ్లేయ భాషా సాహితీ ధురీణులు" అని ప్రశంసించాడు. గురజాడ తర్వాత నరసయ్య ఆంగ్లభాషా వైదుష్యాన్ని ప్రస్తుతించిన వ్యక్తి వెంకటరంగయ్య. “దంపూరు నరసయ్య యన్నచో ఈయనకు వార్తాప్రచార ముగ్గుపాలతో నలవడియున్నది” అని ప్రస్తుతించాడు. నరసయ్యను “నెల్లూరు జర్నలిజం జనకుడ”ని బంగోరె నుతించాడు. నెల్లూరు పయొనీర్ కన్న ముందునుంచీ 'నెల్లూరు డిస్ట్రిక్ట్ గెజిటు' వారం వారం క్రమం తప్పకుండా వెలువడుతూనే ఉంది. పరిశోధకులు గెజిటును పత్రికగా అంగీకరించారు.18 ప్రభుత్వేతర రంగంలో తొలిపత్రిక స్థాపించినందువల్ల కూడా నరసయ్య నెల్లూరు పత్రికారంగానికి ఆద్యుడు కాలేదు. ప్రజాశ్రేయస్సుకోసం జీవితం అంతా పత్రికలు నిర్వహించడంవల్ల, నిర్భయంగా, నిర్మొహమాటంగా రాసి ఉన్నత ప్రమాణాలు స్థాపించడంవల్ల నెల్లూరు పత్రికాలోకానికి ఆద్యుడు, ఆరాధ్యుడు అయ్యాడు, జనకుడయ్యాడు. నరసయ్య నెల్లూరు కలెక్టరాఫీసులో ఉద్యోగం చేస్తున్న కాలంలోనే “ఎసన్నియల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్” పుస్తకం ప్రచురించాడు.19 నాలుగైదేళ్ళ ఇంగ్లీషు బోధనానుభవం పుస్తక రచనకు దోహదం చేసి ఉంటుంది.

డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగం

మద్రాసు ప్రభుత్వ విద్యాశాఖ రెండవ డివిజన్‌లో నాలుగు డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగాలకు అభ్యర్ధులు అవసరం అని, 1871 డిసంబరు 9వ తారీకు నెల్లూరు జిల్లా గెజిటులో ప్రకటన వెలువడింది. నెల్లూరుజిల్లాలో విద్యాశాఖలో పనిచేస్తున్న కోటయ్యసెట్టి నరసయ్య అర్హతలకు, యోగ్యతకు ముచ్చటపడి, తన పలుకుబడితో ఈ ఉద్యోగం వేయించినట్లుంది. ఈ ఉద్యోగానికి ఎంపికఅయి, ఆ ఏడు మార్చినెలలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టినట్లుంది. కలెక్టరాఫీసులోనే రెండవ వర్నాక్యులర్ క్లర్కుగా పనిచేస్తున్న మేకల పార్ధసారథినాయుణ్ణి ట్రాన్స్‌లేటరు పోస్ట్‌కు బదిలీ చేసినట్లు ఏప్రిల్ 27వ తేది నెల్లూరు జిల్లా గెజిటు ప్రకటన వెలువడడం వల్ల, నరసయ్య కొత్త ఉద్యోగంలో చేరినసంగతి రూఢి అవుతూంది.

నెల్లూరు మునిసిపాలిటి కమిషనర్ల సమావేశం

ఆ రోజుల్లో మునిసిపాలిటి పాలకమండలి సభ్యులను కమీషనర్లని పిలిచేవారు. జిల్లా కలెక్టరు ముఖ్యమైన అధికారులను కమిషనర్లుగా నియమించేవాడు. 1872