పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

దంపూరు నరసయ్య


చేస్తున్నట్లు, 1884 వరకు ప్రభుత్వ ఉద్యోగం చేసినట్లు, 1901 ప్రాంతాల వరకు జీవించి ఉన్నట్లు గెజిటు ప్రకటనల వల్ల తెలుస్తూంది.6 ఈయన నెల్లూరులో తొలి బ్యాంకింగ్ వ్యవస్థ "పర్మనెంట్ ఫండాఫీసు” ఏర్పాటు చెయ్యడంలో పళ్ళె చెంచలరావుతో కలిసి కృషిచేసి ఆ సంస్థ తొలి అధ్యక్షుడయ్యాడు.7

కోటయ్యసెట్టి నెల్లూరు జిల్లాలో విద్యావ్యాప్తికి కృషి చేశాడు. 1872 జూన్ మాసంలో జరిగిన జిల్లా లోకల్ ఫండ్ బోర్డు సమావేశంలో ఆయనచేసినకృషిని అభినందిస్తూ ఈ విధంగా తీర్మానించారు. “కోటయ్యశెట్టి ఇదివరలో చేసిన ప్రయోజనకారియైన నౌకరిని అంగీకరించుచు ఏప్రిల్ (...) లగాయతు 125 జీతం నుండి 150 రూపాయలకు ఇజాఫా చేయవలసినట్లు ప్రెసిడెంటుగారు చేసిన ప్రపోజలును అందరున్ను ఏక మనస్సుగా అంగీకరించిరి. విద్యా విషయమును గురించి ఉత్సాహముతో నున్ను యెడతెగకుండా కోటయ్య నౌకరి చేసి నందుకున్ను అతని యోగ్యతకున్ను యిట్లు చేయడం ప్రోత్సాహ పరుస్తుంది.....”8

1874లో నెల్లూరుజిల్లాలో ఆరు బాలికా పాఠశాలలు స్థాపించాలని లోకల్‌ఫండు బోర్డు నిశ్చయించింది. ఈ పాఠశాలలకోసం కోటయ్యసెట్టి కృషిచేశాడు. ప్రతివిద్యార్థిని వద్ద అర్ధణా జీతం వసూలు చెయ్యాలని బోర్డుసభ్యులు తీర్మానించారు. కోటయ్యసెట్టి ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, అసమ్మతిని 'డిసెంటు' రాసి తెలియచేశాడు. ఈ సమావేశంలో పాల్గొన్న నలుగురు నామినేటెడ్ సభ్యులు బడా భూస్వాములు. వీరు బాలికావిద్యను తీవ్రంగా వ్యతిరేకించారు.9 ఒకేకుటుంబం నుంచి ఒకరి కంటె ఎక్కువ మంది పిల్లలు పాఠశాలకు, హాజరవుతున్నట్లయితే, మామూలుగా వసూలుచేసే స్కూలు ఫీజులో సగం మాత్రమే వసూలు చెయ్యాలని ఆయన చేసిన ప్రతిపాదనను బోర్డు సభ్యులు ఆమోదించలేదు.10

కోటయ్యసెట్టి - పళ్ళె చెంచలరావు, ఆర్. రఘునాథరావు మొదలైనవారి ఆలోచనాధోరణికి చెందినవాడు. బ్రహ్మసమాజ భావాలను అభిమానించాడు. మత విశ్వాసాల ప్రమేయంలేని లౌకిక విద్య ఈ దేశానికి అవసరం అని భావించాడు. పాఠ్యపుస్తకాలలో ప్రత్యేకంగా ఒకమతానికి సంబంధించిన దేవతల పేర్లను స్మరించడం లౌకిక విద్యావిధానానికి విరుద్ధమైనదని గట్టిగా నమ్మాడు. వెంకటగిరి జమీందారు సర్వజ్ఞకుమార యాచేంద్ర 'నీతి సూత్రము' పేరుతో చిన్న పుస్తకం రాసి అచ్చు వేశాడు.11 దాన్ని బళ్ళలో పాఠ్యపుస్తకంగా ప్రవేశపెట్టించాలనే ఆలోచనతో, కోటయ్య సెట్టికి ఆ పుస్తకాన్ని పంపించాడు. అంతటి మహారాజు తన అభిప్రాయాన్ని కోరాడని ఉబ్బిపోకుండా, స్పష్టంగా, నిర్మొహమాటంగా కోటయ్యసెట్టి తనఅభిప్రాయాన్ని తెలియచేస్తూ సమాధానం