పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

43


పాఠశాల పనిచేస్తుంది. అదికాక ఒక 'యూనియన్ స్కూలు' ఉంది.4 మొత్తం మీద నరసయ్య సంస్థానం కొలువు మానుకొని ప్రభుత్వ అజమాయిషీ ఉన్న ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరిపోయాడు. చివరకు పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాల ఉద్యోగం మానుకొని, మారుమూల, వెంకటగిరిలో ఒక చిన్నబడిలో ఉపాధ్యాయుడుగా, అనామకంగా రోజులు గడపవలసి వచ్చింది. నరసయ్య పరిస్థితి నెల్లూరు రేంజి డెప్యూటీ స్కూల్స్ ఇన్‌స్పెక్టరు చుండూరు కోటయ్య సెట్టిద్వారా నెల్లూరు కలెక్టరాఫీసులో పనిచేస్తున్న ఒక ఇంగ్లీషు అధికారి దృష్టికి వచ్చింది. ఆయన నరసయ్యను నెల్లూరు కలెక్టరాఫీసులో అనువాదకుడుగా చేరమని ఆహ్వానిస్తూ ఉత్తరం రాశాడు.5 ఆ ఉత్తరానికి అనువాదం:

నెల్లూరు,

20, డిసంబరు 1870

సర్,

మీరు అప్పుల పాలైన విషయం నాకు ఎవరూ చెప్పలేదు. ఎవరైనా చెప్పినా నేను పట్టించుకొని ఉండను. సుదర్శనరావుచేత మీకు రాయించాను. ఆ ఉత్తరం ఆంతర్యం మీరు గ్రహించలేకపోయారు. వారు రాజాగారి కొలువు మానుకొని వెంకటగిరి స్కూల్లో పనిచేస్తున్నారని, విద్యాశాఖనుంచి ఈ సేవలు గ్రహించవచ్చని, నిన్ననే కోటయ్యసెట్టిద్వారా తెలిసింది. ఈ పరిస్థితులలో మిమ్మల్ని అనువాదకుడి ఉద్యోగంలో నియమించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ (నియామకాన్ని) రేపు అదనంగా వెలువరించే గెజిటులో ప్రచురిస్తాను. సెలవుల తర్వాత, తప్పకుండా పనిలో చేరాల్సి ఉంటుంది. ఈ ఆఫీసుపని మీకు నచ్చుతుందా అని నాకు సందేహంగా ఉంది. ఇష్టమైతే సక్రమంగా ఆఫీసుకు హాజరయి, కొంత గొడ్డుచాకిరి చెయ్యడానికి నిశ్చయించుకోవాలి. నేను మద్రాసు వెళ్తున్నాను. సెలవులు ముగిసేదాకా తిరిగిరాను.

మీ

విశ్వాసపాత్రుడు

గ్రాంట్ (.........)

అప్పటి జిల్లా కలెక్టరు వేన్స్ ఏగ్ను నరసయ్య “విద్యాకుశలత” కు మెచ్చి కలెక్టరాఫీసులో “ట్రాన్సులేటరు” గా నియమించినట్లు ఒంగోలు వెంకటరంగయ్య పేర్కొన్నాడు.

చుండూరు కోటయ్య సెట్టి

కోటయ్యసెట్టి నెల్లూరువాడు. పళ్ళె చెంచలరావు సమకాలికుడు, స్నేహితుడు. 1867 నాటికే నెల్లూరు జిల్లాలో విద్యాశాఖలో డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు ఉద్యోగం