పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

11

వచ్చే సమయానికి పాపయ్య మద్రాసులో పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించి పురప్రముఖులలో ఒకరుగా ప్రసిద్ధి పొందాడు. 1789-90 మధ్యకాలంలో మద్రాసు గవర్నరులుగా పనిచేసిన హాలెండ్ సోదరుల వద్ద (John Holland 7th Feb. to 12th Feb. 1789; Edward John Holland 12th Feb. 1789 to 19th Feb. 1790) దుబాసీగా ఉండి వారి అభిమానాన్ని సంపాదించాడు. వారి ఆంతరంగికుడుగా మసలుకొన్నాడు. ఆ సమయంలోనే హాలిబర్టన్ (Haliburton) అనే ప్రభుత్వ అధికారి ఆగ్రహానికి గురయి, రాజద్రోహనేరం మోపబడి జైలుశిక్ష అనుభవించి 1809లో మరణించాడు. మద్రాసులో చూశైప్రాంతంలో శిక్ష అనుభవించడంవల్ల అక్కడ ఒక వీధి అవధానం పాపయ్యవీధి అని వాడుకపడింది.3 పాపయ్య ప్రభ వెలిగిపోతున్న సమయంలో వెంకటగిరి సంస్థానంవారు సూళ్ళూరుపేట (నెల్లూరుజిల్లా) సమీపంలో ఉన్న సామంతమల్లం గ్రామాన్ని ఆయనకు బహూకరించారు. ఆయన గొప్ప పండితుడు. అనేక భాషలు అనర్గళంగా మాట్లాడేవాడు. స్కాంద పురాణంలో కొంతభాగాన్ని - శంకరసంహితను తెలుగులో పద్యగ్రంథంగా అనువదించాడు.4 సర్ వాల్టర్ స్కాట్ సర్జన్స్ డాటర్ (Sir Walter Scott's Surgeon's Daughter) నవలలో పాపయ్యను ఒక అప్రధాన దుష్టపాత్రగా చిత్రించాడు. ఈ పాపయ్య మనుమరాలు (కూతురు బిడ్డ) అన్నపూర్ణమ్మ నరసయ్య తల్లి. నరసయ్య తండ్రి ఆదినారాయణయ్య మద్రాసులో పుట్టి, అక్కడే స్థిరపడ్డాడు. ఆయన వృత్తేమిటో తెలియదు. ఇంగ్లీషు చదువులు చదివినట్లుంది. ఆయనకు ప్రెస్ వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది.

మద్రాసులో దంపూరు కుటుంబాలు

క్రైస్తవ మతప్రచారకుల కృషివల్ల దేశభాషలలో పుస్తకప్రచురణ సాధ్యపడింది. వారు మద్రాసు, విశాఖపట్నం, బళ్ళారి మొదలైన ప్రదేశాలలో అచ్చుకూటాలు ప్రారంభించి పుస్తక ప్రచురణ మొదలుపెట్టారు. బైబిలును, ఇతర మత సంబంధమైన పుస్తకాలను, వ్యాకరణ, నిఘంటు గ్రంథాలను ప్రచురించారు. 1820లో మద్రాసు స్కూల్ బుక్ సొసైటీ ఏర్పడింది. మద్రాసులో పుస్తకప్రచురణ వ్యాపారంగా మార్పు చెందుతున్న దశలో 'కోమట్లు', ఇతర కులాల తెలుగువారు ఈ వ్యాపారంలో ప్రవేశించారు. పాఠ్యపుస్తకాలు రాయడం, పరిష్కరించడం, ప్రూఫులు సరిచూడడం, మొదలైన పనులకు పండితులు అవసరం అయ్యారు. నెల్లూరుమండలం నుంచి మద్రాసుకు వలసవచ్చిన పుదూరు, తుమ్మగుంట ద్రావిడ పండితులు ఈ కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకొన్నారు.

దంపూరువారు

దంపూరువారిది పండితకుటుంబం. దంపూరు నెల్లూరుకు తూర్పున, తుమ్మగుంటకు, వావిళ్ళకు సమీపంలో ఉన్న గ్రామం. ఊరి పేరే ఇంటి పేరయింది. పందొమ్మిదోశతాబ్ది