పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

దంపూరు నరసయ్య

పొలాలు దున్ని, శరీరకష్టంచేసి, పంటలు పండించారు. ఈ ద్రావిడ కుటుంబాలలో ఎంతోమంది మహావిద్వాంసులు జన్మించారు.

దుబాసీలు

రెండు మూడు వందల సంవత్సరాల కిందటే, తుమ్మగుంట ద్రావిడులు నెల్లూరు మండలం నుంచి తమిళ, కన్నడ దేశాలకు వలసవెళ్ళారు. కొందరు చెన్నపట్నంలో, తమిళదేశంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఆ ప్రదేశాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. మద్రాసు పగడాలసెట్టి వీధిలో సూరంవారు, కృష్ణప్ప నాయకన్ వీధిలో గుర్రంవారు ప్రఖ్యాతి పొందారు, వీళ్ళకు ఓడ వర్తకంతో సంబంధం ఉండేది.2 ఎక్కడఉన్నా నెల్లూరుతో సంబంధ బాంధవ్యాలు సాగిస్తూ, నెల్లూరు వారుగానే వ్యవహరించబడుతూ వచ్చారు.

ఇంగ్లీషువారికి, ఇతర యూరపు దేశస్థులకు స్థానిక వ్యాపారపద్ధతులు, కొలతలు, చట్టాలు తెలియకపోవడంవల్ల దుబాసీల అవసరం ఏర్పడింది. ఈస్టిండియా కంపెనీ, ఇతర వర్తకసంస్థలు దుబాసీలను నియమించుకొన్నాయి. తెలుగుదేశం నుంచి మద్రాసు తరలి వచ్చిన కోమట్లు, ఇతర కులాలవారిలో కొందరు దుబాసీలుగా మారారు. పాశ్చాత్య వాణిజ్యవర్గాలకు, భారతీయులకు మధ్య వారధిగా నిలిచారు. ఆనందరంగపిళ్ళై, పచ్చయ్యప్ప మొదలియారు దుబాసీ వృత్తిలో మహా సంపన్నులయ్యారు.

పద్దెనిమిదోశతాబ్ది ముగింపుకు వచ్చేసరికి, బ్రిటిష్ వారు ఈదేశంలో తమ అధికారాన్ని స్థిరపరచుకొన్నారు. దుబాసీల మీద ఆధారపడే పరిస్థితి క్రమంగా తొలగిపోవడంవల్ల, ఈ వ్యవస్థ బలహీనపడింది. 1830 ప్రాంతాలకు దుబాసీలు చిల్లర ఉద్యోగులుగా మార్పు చెందారు. వీరు నాలుగురాళ్ళు వెనక వేసుకోడానికి ఇంగ్లీషు నేర్చుకొన్నారే తప్ప, ఆభాష ద్వారా నూతన భావజాలాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యలేదు. ఇంగ్లీషు వ్యవహార జ్ఞానం దుబాసీల కుటుంబాలలో వారసత్వంగా కొనసాగినట్లుంది.

అవధానం పాపయ్య

అవధానం పాపయ్య నెల్లూరువాడు, తుమ్మగుంట ద్రావిడులలో ప్రసిద్ధుడు. కంపెనీ కొలువులో మామూలు గుమాస్తాగా జీవితం ఆరంభించాడు. మద్రాసు ఓడరేవులో 'సీ కస్టమ్స్ ఆఫీసరు' (Sea Customs Officer) వద్ద 'ఏంకరేజి అకౌంటెంట్' (Anchorage Accountant) ఉద్యోగం చేశాడు. రేవుకు వచ్చిపోయే ఓడలను నమోదు చేసుకోవడం ఆయన వృత్తి కావడం వల్ల 'లంగరు పాపయ్య' అని పేరు స్థిరపడింది. బంధువర్గంలో మాత్రం 'రఘుపతి' అనే పేరుతో పిలవబడేవాడు. పద్దెనిమిదవ శతాబ్ది ముగింపుకు