పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

దంపూరు నరసయ్య


మొదలయ్యే వేళకు కొన్ని దంపూరు కుటుంబాలు మద్రాసులో స్థిరపడ్డాయి. కొంతమంది దంపూరువారు అచ్చాఫీసు పనులలో స్థిరపడ్డారు. దంపూరు వేంకటసుబ్బాశాస్త్రి పర్యవేక్షణ, సంపాదకత్వంలో తెలుగు, సంస్కృత గ్రంథాలు అచ్చయ్యాయి. ఈయన గొప్ప పండితుడని ప్రసిద్ది.5 నరసయ్య తండ్రి ఆదినారాయణయ్య ఈయన సమకాలికుడు. ఇద్దరూ రక్తసంబంధీకులయి ఉంటారు. ఆదినారాయణయ్య తన ముగ్గురు కుమారులకు ఇంగ్లీషు చదువు చెప్పించాడు. మహాపండితులని పేరుపడ్డ గుర్రం అప్పన్నశాస్త్రి, వెంకన్నశాస్త్రి సోదరులు ఈయనకు దగ్గర బంధువులు. పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్ధంలో ఇంగ్లీషుచదువులు చదువుకొని, పరీక్షలు పాసై, ప్రభుత్వోద్యోగాలు చేసిన దంపూరువారు మరికొంతమంది ఉన్నారు.6 ఈ శతాబ్దంలో ఇంగ్లీషుచదువులు చదివినవారిలో ఎక్కువమంది బ్రాహ్మణులే అయినా, తెలుగుదేశంలో నియోగులు, దేశస్థులు, మాధ్వులు ముందుగా ఇంగ్లీషుచదువు 'విలువ' ను గ్రహించారు.

నరసయ్యకు ఇద్దరు అక్కలు. ఒకరు మీనాక్షమ్మ, నరసయ్యకన్న ఆరేళ్ళు పెద్దది. చదువుకొన్న స్త్రీ. పదిహేనేళ్ళకే భర్త చనిపోయాడు. రెండోఆమె వివరాలు తెలియవు. నరసయ్య పెద్దన్న 'పార్ధసారథయ్య' లేక పార్ధసారధిశాస్త్రి మద్రాసు అకౌంటెంట్ జనరలు ఆఫీసులో క్లర్కుగా పనిచేసినట్లు ఫోర్టు సెంటుజార్జి గెజిటు ప్రకటనవల్ల తెలుస్తూంది. రెండవ అన్న కృష్ణయ్య పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో 'టీచరు'. ఇద్దరూ 1869-70 సంవత్సరానికి మద్రాసులో 'క్రౌను ఆఫీసు'కు స్పెషల్ జూరర్లుగా నియమించబడ్డారు. ఈ 'గౌరవ' పదవికి ఇంగ్లీషు భాషాజ్ఞానం, మూడువేలరూపాయల ఆస్తి ఉండడం అర్హత. పార్థసారథిశాస్త్రి ట్రిప్లికేన్‌లో, కృష్ణయ్య బ్లాక్ టౌన్‌లో నివాసం ఉంటూ, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.7 అవధానం పాపయ్య తరంనుంచి నరసయ్య వరకు అందరికీ ఇంగ్లీషు వారసత్వంగా సంక్రమించింది.

నరసయ్య జననం, విద్యాభ్యాసం

నరసయ్య మద్రాసులో పుట్టి పెరిగినట్లు ఒంగోలు వెంకటరంగయ్య రాశాడు. 1849 సెప్టెంబరు 25న జన్మించినట్లు పెన్నేపల్లి గోపాలకృష్ణ నిరూపించాడు. నరసయ్య 1896 దినచర్యలో సెప్టెంబరు 25వ తారీకున తన 48వ పుట్టినదినమని, తెలుగు తిథుల ప్రకారం మహర్నవమినాడు తన పుట్టినదినం వస్తుందని రాసుకున్నట్లు ఆధారం చూపాడు8. ఆ దినచర్య ఇప్పుడు లభించడం లేదు. 1906 సెప్టెంబరు 25వ తారీకు, మంగళవారం దినచర్యలో నరసయ్య ఈ విధంగా రాశాడు.

"Thankful-This day is my birthday according to English Calender.

NB : This is my 58th Birthday. ie. I Completed 57 Years.

My Birthday was Tuesday 25th September 1849."