పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

దంపూరు నరసయ్య


బోధపడుతుంది. "Reading London (.............) magazine" అనే వాక్యం దినచర్య పుటల్లో తరచుగా కనపడుతుంది. సీరియస్ రచనలేకాక, కాలక్షేపంకోసం 'సిక్స్ పెన్నీ' (Six penney) నవలలు, కథలు చదివినట్లు దినచర్యల్లో రాసుకొన్నాడు. భర్తృహరి, భగవద్గీత ఇతర సంస్కృత గ్రంథాలు చదివినవైనం దినచర్యల్లో ఉంది. రచయిత పేరు, పుస్తకం పేరు ఒకటి రెండు సన్న అక్షరాలలో పేర్కొన్నందువల్ల నరసయ్య చదివిన పుస్తకాల పేర్లు, పత్రికల పేర్లు వివరంగా తెలుసుకోడానికి సాధ్యపడలేదు. ఏ పుస్తకం చదివినా, దానిమీద ఒక వాక్యంలో తన అభిప్రాయం రాసుకోడం ఆయన అలవాటు. "Reading Uncle (John) and finished it by 6 p.m. The book is a beautiful story written in a very ( ) Not a dull line from beginning to end" "Reading Mrs. Besant's Lectures (8) 5th 1891. How clear and eloquent !" "Reading 'Gone' - A story of some years of memory through!" "Reading again "Tenant of Wild Fell Hall-" how clever the author Ani Bronti is!" ఇటువంటి వాక్యాలు దినచర్యలో తరచుగా కన్పిస్తాయి.15 నరసయ్య చరమ సంధ్యలో కూడా సమకాలిక జాతీయ, అంతర్జాతీయ విషయాలను గమనిస్తూనే ఉన్నాడని, సాహిత్య గ్రంథాలను, ఉబుసుపోక పుస్తకాలను చదువుతున్నాడని చెప్పడానికి దినచర్య నుంచి వివరంగా ఉదాహరించవలసి వచ్చింది.

మతవిశ్వాసాలు

1901 కోర్టు వాఙ్మూలంలో తాను స్మార్త బ్రాహ్మణుణ్ణని నరసయ్య చెప్పుకొన్నాడు. ఆచరణలో ఆయన బ్రహ్మసమాజ భావాలకు దగ్గరగా జరిగినట్లు తోస్తూంది. తల్లితండ్రుల తిథులు జరపడం, శ్రావణ పౌర్ణిమనాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించడం - ఈ రెండు మతకర్మలను మాత్రమే ఆయన పాటించాడు. నరసయ్యకు శిఖ ఉండేదని ఆయన వంశీయులు తెలిపారు. క్షురకర్మ, స్నానపానాలు, భోజన భాజనాలు, వాహ్యాళి వంటి ప్రతి నిత్యకృత్యాన్ని దినచర్యలో ఆయన రాశాడు. మద్రాసు, నెల్లూరు, వెంకటగిరి ప్రయాణాలలో ఒక పర్యాయం కూడా గుడికి వెళ్ళినట్లు పేర్కొనలేదు. అనుష్ఠానపరులైన బ్రాహ్మణుల వలె సంధ్యావందనం, దేవతార్చన చేసినట్లు ఏ ఒక్కరోజూ ప్రస్తావించలేదు. దినచర్య మామూలుగా "Prayed and laid down" అనే వాక్యంతో ముగుస్తుంది. "Reading and meditating" వంటివాక్యా లు, "Remembering myself and family to the kind keeping and care and mercy of our Father at Heaven" వంటివాక్యాలు అప్పుడప్పుడూ కనిపిస్తాయిగాని, సగుణబ్రహ్మ ప్రస్తావన కనిపించదు. నూతన సంవత్సరం ఉదయం ప్రార్ధనచేసినట్లు, కొన్ని సంస్కృత శ్లోకాలు పఠించినట్లు పేర్కొన్నాడు. 1905 దినచర్య తొలిపుటమీద 'శ్రీరామ' అని రాయడం తప్ప, మూడు