పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

దంపూరు నరసయ్య


ఆదాయాన్ని కోల్పోతున్నదని 'రవి' పత్రిక ప్రచురించిన వార్తను తన పత్రికలో పునర్ముద్రించాడు. ఫీడర్ రైలు (Feeder rail) మార్గాలు నిర్మించాలని, కృష్ణాపట్నం నెల్లూరు రైలుమార్గం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. న్యాయస్థానాల్లో జరిగే జాప్యాన్ని, అవినీతిని ప్రస్తావించి, “జిల్లా మునిసిఫులకున్న అధికారాలు గొప్పవి. వారి జీతాలు మాత్రం చాలా తక్కువ” అని, ఇందువల్లే జిల్లా న్యాయస్థానాల్లో అవినీతి ప్రబలిందని విశ్లేషించాడు.57

నెల్లూరులో కల్లుఅంగడి యజమాని పొద్దస్తమానం కల్లుతాగమని చాటింపువేయడాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వస్తాడు. “పాదచారులను మద్యపానానికి పురికొల్పడాన్ని చట్టం అంగీకరిస్తుందా? ప్రజలు తాగుబోతులు కావాలని ప్రభుత్వం కోరుకొంటున్నదా?” అని ప్రశ్నించి, చట్టవిరుద్ధమైన ప్రచారాన్ని నిరోధించమని జిల్లా అధికారులను కోరుతాడు.58

గంగిరెద్దులవాళ్ళు, పాములవాళ్ళు, విప్రవినోదులు మొదలైన సంచార యాచకులంటే నరసయ్యకు అసహ్యం. సోమరులన్నా, యాచకులన్నా ఆయనకు పడదు. యాచకవృత్తిని నిషేధించాలని తరచుగా పత్రికలో రాశాడు. “భారతదేశాన్ని బిచ్చగాళ్ళదేశం అని అనవచ్చు. లక్షలాది ప్రజలు యాచకవృత్తిలో జీవిస్తున్నారు. యాచన అవమానకరమైనదని గానీ, తప్పని గానీ వారు భావించరు. యాచకులకు సంబంధించి ఒక చట్టం తీసుకొనిరావాలి. బిచ్చమెత్తుకొనేందుకు లైసెన్సుఫీజు విధించాలి. ఈ చట్టం కుంటి, గుడ్డి యాచకులకు కూడా వర్తింపచేయాలి” అని పలుమార్లు రాశాడు.59 అన్నదానం వంటి వాటిమీద ఆయనకు నమ్మకం ఉంది. మహారాణి మరణించినపుడు భారతదేశ సంప్రదాయాన్ని అనుసరించి, నిరుపేదలకు ఒక రోజు అన్నదానం చెయ్యమని ప్రభుత్వానికి సూచిస్తాడు.60 నరసయ్య తన చిన్న స్థానిక వారపత్రికలో జాతీయ అంతర్జాతీయ విషయాలమీద రాశాడు. పోలీసుశాఖలో పైఅధికారులంతా తెల్లవారే అనీ, ఎంత తెలివితేటలున్నా స్థానికులకు ఉన్నత పదవులివ్వరని, మైసూరు సంస్థానంలో దేశీయులే పోలీసు ఉన్నతాధికారులుగా ఉన్నారని వివరిస్తాడు.61 భారతీయులు ఇంగ్లాండు వెళ్ళి, క్లిష్టమైన పరీక్షల్లో కృతార్థులైతేనే తప్ప కలెక్టరు వంటి ఉన్నత పదవులు ఇవ్వరు. ఈ పద్ధతిలోనే యూరోపియన్లు స్థానిక భాషలు విధిగా నేర్చుకొని పరీక్షలు పాసైతేనే వారికి ఈ దేశంలో ఉద్యోగాలివ్వాలి. స్థానికభాషలు నేర్చుకొన్నందుకు ఇంగ్లీషు అధికారులకు ప్రోత్సాహక బహుమతులివ్వడం ఏం న్యాయం అంటాడు.62

మద్రాసు, బొంబాయి ప్రభుత్వాలలో గవర్నరు, ఇద్దరు సలహాదారులు ఉన్నారని,