పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

125


ఇతర పరగణాలలో సలహాదారులు లేరని, సలహాదారుల నియామకం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్ప ప్రజలకు ఒనగూడేదేమీ లేదని విమర్శిస్తాడు. పది, ఇరవై వేల జీతాలిచ్చి, గవర్నర్లను, గవర్నరుజనరల్‌ను నియమించడంకన్నా, నిజాయితీపరులైన ఆ దేశ సంపన్నులను ఆహ్వానించి, అయిదు, ఎనిమిదివేల జీతంతో సలహాదార్లుగా నియమించవచ్చని, అందువల్ల ప్రభుత్వ వ్యయం ఆదా అవుతుందని సూచిస్తాడు.63

లెజిస్లేటివ్ కౌన్సిలు సక్రమంగా జరగడం లేదని, నెలకొకపర్యాయమైనా సమావేశం కావడంలేదని, “గౌరవనీయులైన సభ్యులు” అనే మర్యాదా వాచకం తమ పేరు ముందు చేరినందుకే సభ్యులు సంతృప్తి చెందినట్లుందని, ఎద్దేవా చేస్తాడు. కౌన్సిలు సమావేశాలు కనీసం నెలకొకసారయినా జరగాలని, అనధికార సభ్యులకు గౌరవభృతి ఇవ్వాలని ప్రతిపాదిస్తాడు.64

ఉప్పుపన్ను

నరసయ్య ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో ఒక నెలలోనే రెండుసార్లు ఉప్పుపన్నుమీద రాశాడు. “పాలకులు పేదలపట్ల కనికరం చూపడం లేదు. నిరుపేదలు గంజిలో వేసుకొనే ఉప్పును ఎక్కువ ఖరీదుకు అమ్మడం అన్యాయమని తోచకపోవడం ఆశ్చర్యంగా ఉంది” అని అంటాడు. “ఆహారపదార్థాల మీద పన్ను విధించడమే తప్పు. ఆహార పదార్థాలన్నిటిలో ఉప్పు ప్రధానమైనది. ఉప్పుమీద పన్ను విధించడం అన్యాయమైన చర్య. దీనికన్న పోల్‌టాక్సు (Poll tax) విధించడంమేలు. మనుషులకు, వశువులకు వినియోగించుకోడానికి, ఆరోగ్యం కాపాడుకోడానికి సరిపడేంత ఉప్పును దేవుడిచ్చాడు. చట్టాలు తయారుచేసి, పెద్ద అధికార గణాన్ని నియమించి, పన్నువసూళ్ళలో లోటు రాకుండా పేదలను బాధించడం మహానేరం. ఉప్పుపన్ను చట్టాలలో సవరణలు తెచ్చిన వ్యక్తిని ప్రజలు విముక్తి ప్రదాతగా, దేవతదూతగా భావిస్తారు” అని ఆవేదనతో రాస్తాడు.65

మద్రాసు మహాజనసభ - రైతు సంఘాలు

కాంగ్రెసు సంస్థను గురించి నరసయ్య అభిప్రాయాలు తెలుసుకొనే అవకాశం లేదు. మద్రాసులో జరిగిన కాంగ్రెసు సభలకైనా ఆయన హాజరయ్యాడో లేదో ఈ రచయిత నిగ్గు తేల్చలేక పోయాడు. ప్రభుత్వ అనువాదకుడు ఆంధ్రభాషా గ్రామవర్తమానిమీద తయారుచేసిన రహస్య నివేదికలలో కాంగ్రెసు ప్రస్తావనలు రాలేదు. ఈ పత్రిక నడిపే రోజులలో నరసయ్యకు మద్రాసు మహాజనసభమిద అపారమైన విశ్వాసం ఉంది.