పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

123


కూడా మింగుడు పడి ఉండదు. పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్రభాషా గ్రామవర్తమాని నిలబడలేక పోవడానికి ఇవి కూడా కారణాలు కావచ్చు.

స్థానిక సమస్యలు

నరసయ్య అనేక స్థానిక సమస్యలను తన పత్రికలో చర్చించాడు. వ్యవసాయదారులు పశుసంపద మీద ఆధారపడి జీవిస్తారని, పశువుల ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల వ్యవసాయాభివృద్ధి మందగిస్తుందని రాశాడు. ఆయనకు శాస్త్రీయ వ్యవసాయంమీద గొప్ప అవగాహన ఉంది. కల్నల్ ఆల్కాట్ వ్యవసాయంమీద రాసిన వ్యాసాన్ని పీపుల్స్ ఫ్రెండ్‌లో ప్రచురించాడు.51 ఇంగ్లీషువారు కృషివిజ్ఞానాన్ని నిర్దుష్టమైన కళగా అభివృద్ధి పరచి, అనేక నూతన వ్యవసాయ విధానాలను అమలుచేస్తున్నారని ఒక వ్యాసంలో మెచ్చుకొంటాడు.52 గ్రామాలలో వ్యాపించిన కలరా, మలేరియా జబ్బుల గురించి, క్వినైన్ గ్రామీణులకు అందుబాటులో లేకపోవడాన్ని గురించి రాశాడు. అనుభవజ్ఞులైన సంచారవైద్య సిబ్బందిని నియమించి, గ్రామాలలో వైద్య సౌకర్యాలు కలిగించాలని సూచించాడు.53 నెల్లూరు జిల్లా వైద్యశాలలో వైద్యపరికరాలు, మందులకొరత తీర్చి పేదలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, జిల్లా బోర్డు ప్రతి తాలూకాలో ఒక ఆయుర్వేద కళాశాలను ప్రారంభించి అర్హతగల వైద్యులను తయారు చెయ్యాలని, నకిలీ వైద్యులను నిషేధించాలని ఒక విలేకరి రాసిన వ్యాసాన్ని ప్రచురించాడు.54

నెల్లూరు మునిసిపాలిటీ ఆరోగ్యకరమైన ప్రదేశంగా అభివృద్ధి చెందడానికి నరసయ్య అనేక సూచనలు చేశాడు. పూర్తి సమయం కేటాయించగల 'పెయిడ్ చేర్మన్' ను నియమించాలని, ఎప్పుడో తీరిక వేళల్లో ఆఫీసు విధులకు హాజరయ్యే వ్యక్తి తన బాధ్యతలకు న్యాయం చెయ్యలేడని వాదిస్తాడు. పౌరులు చట్టపరిజ్ఞానం కలిగి ఉంటేనే ప్రజాసౌకర్యాలు మెరుగవుతాయని, అసమర్థులను, చట్టం తెలియని వారిని కౌన్సిలర్లుగా నియమించిన జిల్లా కలెక్టరును, ఎన్నుకొన్న పౌరులను తప్పుపడ్డాడు. సమర్థులైనవారు కౌన్సిలర్లుగా ఉన్నప్పుడే మునిసిపాలిటీ బాగుపడుతుందని రాశాడు.55

నరసయ్య పోలీసు, తపాలాశాఖలలో సంస్కరణలను సూచిస్తూ సలహాలిచ్చాడు. పోలీసుశాఖల అవినీతిని గురించి, అసమర్ధపాలన గురించి రాశాడు. విలేజి పోస్టుమాస్టర్ల జీతబత్యాలను పెంచాలని రాశాడు. ఆస్ట్రేలియాలో తపాలాశాఖ పత్రికలను ఉచితంగా బట్వాడా చేస్తుందని, ఆ చిన్న సదుపాయం ఇక్కడి పత్రికలకు ఎందుకు కలుగజేయగూడదని ప్రశ్నిస్తాడు.56 విశాఖ ఓడరేవును అభివృద్ధి చెయ్యకపోవడంవల్ల ఆ ప్రాంతపు మాంగనీసు ఖనిజం రైలుమార్గంగుండా, కలకత్తా ఓడరేవు ద్వారా ఎగుమతి అవుతున్నదని, విశాఖరేవు