పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

119


చెయ్యడానికి 1856 చట్టంలోని 6వ సెక్షను అధికారం కల్పిస్తున్నది.” ఈ చట్టాన్ని పురస్కరించుకొని మరమ్మత్తుశాఖ అధికారులు చేసే బలవంతపు వసూళ్ళను, సప్లైల కోసం చేసే దాష్టీకాన్ని నరసయ్య పత్రికాముఖంగా బహిర్గతం చేశాడు.

లార్డ్ స్టాన్లీ ఆల్డర్‌లీ (Lord Stanely Alderley) భారతదేశంలో అమలులో ఉన్న నిర్బంధ వసూళ్ళు చట్టవిరుద్ధమైనవని లార్డ్స్ సభ (House of Lords) లో చేసిన ఉపన్యాసాన్ని లా టైమ్స్ (Law Times) పత్రిక నుంచి ఉదాహరించి, “ఈ దేశంలో నిజంగానే అటువంటి చట్టం అమలులో ఉందా?” అని నరసయ్య నెల్లూరు కలెక్టరును నిలదీస్తాడు. “అటువంటి చట్టం అమల్లో ఉంటే, 'కుడిమరమ్మత్తు' పనులకు రమ్మని రైతులను బలవంతపెట్టే అధికారం ఎవరికి ఉంది?” అని అక్రమ నిర్బంధ శ్రమను వ్యతిరేకిస్తాడు.38

“అధికారులకు లంచం చేతిలో పడకపోతే, రైతులకు ఏదీ సవ్యంగా జరగదు. డెల్టా అధికారులు రెవెన్యూ అధికారుల మాదిరే ప్రవర్తిస్తున్నారు. గ్రామాలకు నీరు సక్రమంగా పంపిణీ చెయ్యడం లేదు. నిష్పక్షపాతంగా నడుచుకోడం లేదు. సేద్యాలు దెబ్బతింటున్నాయి. రైతులు చందాలు వేసుకొని గ్రామాధికారుల ద్వారా నీటిపారుదలశాఖ అధికారులకు లంచాలు ముట్టచెప్పి పనులు జరుపుకొంటారు. ఈ అక్రమాలను విచారించే నాథుడే లేడు. నీళ్ళు సక్రమంగా ఇస్తే, ఎంత సెస్సు విధించినా రైతులు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు” అని సాగునీటి ఇబ్బందులను గురించి వివరిస్తాడు. పంటకాలువలు తవ్వి బీళ్ళు సాగులోకి తెస్తే ప్రభుత్వాదాయం పెరుగుతుందని సూచిస్తాడు.39

టెనెన్సీ బిల్లు (Tenancy Bill)

ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో నరసయ్య రాసిన వ్యాసాలలో పాలికాపుల తరఫున, టెనెన్సీ బిల్లుమీద రాసిన వ్యాసం ముఖ్యమైనది. ఈ వ్యాసంలో ఆయన వర్గదృక్పథం వ్యక్తమవుతుంది. తాను చిన్నపాటి భూస్వామి అయి ఉండీ, పేదకౌలుదార్ల తరఫున వకాల్తా పుచ్చుకొంటాడు. “కౌలుదారిబిల్లు గతి ఏమయిందని” ప్రశ్నిస్తాడు. "ప్రభుత్వానికి నిరుపేద రైతులమీద రవంతయినా దయలేదా? భూస్వాముల కబంధహస్తాల్లో కౌలుదార్లు ఎంతకాలం నలిగిపోవాలి?” అని తీవ్రంగా నిరసిస్తాడు. “భూస్వాములు పేదరైతుల కష్టాలు పట్టించుకోడం లేదు. ఎన్నో ఏళ్ళుగా సాగుచేసుకొంటున్న రైతులను క్షణంలో తొలగించి భూములు స్వాధీనం చేసుకొంటున్నారు. రైతులు దుక్కులు దున్ని రెండో కారుపెట్టడానికి పొలాలను సన్నద్ధం చేసుకొంటున్న తరుణంలో, కౌలుదార్లను తొలగించి, కొత్తవారికి కౌలుకిస్తున్నారు. టెనెన్సీ బిల్లు వస్తేకాని పేదరైతుల బాధలు పోవు” అని మరొక వ్యాసంలో రాస్తాడు.40 కౌలుదారులను తొలగించి భూస్వాములు కొత్తవారికి