Jump to content

పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

దంపూరు నరసయ్య

విద్యా గంధంలేనివారిని, ఒకే కుటుంబానికి చెందినవారిని, అన్నదమ్ములను పక్కపక్క పల్లెల్లో గ్రామ మునిసిపులుగా నియమించడాన్ని నరసయ్య వ్యతిరేకించాడు.33 స్థానికులను గ్రామాధికారులుగా నియమించే విధానాన్ని మాని, విద్యావంతులు, సమర్థులైనవారిని గ్రామాధికారులుగా నియమించాలని, రైతుల కష్టాలు కడతేరడానికి ఇదొకటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డాడు. గ్రామాధికారులు విధులు నిర్వహించే గ్రామాలలో వారికి భూములుండకూడదని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును మద్రాసు పరగణాలో కూడా అమలుచెయ్యాలని ప్రభుత్వాన్ని అర్థిస్తాడు.34 పెద్ద భూస్వామ్య కుటుంబానికి చెందిన కోడూరు మునిసిపు అక్రమాలను పత్రిక ద్వారా వెలికితెచ్చి, ప్రభుత్వం అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగించేవరకు ఆయన నిద్రపోలేదు.35

గ్రామాధికారులకు వ్యతిరేకంగా ఇంత రాసినా, వారి కష్టాలు నరసయ్యకు తెలియకపోలేదు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పత్రికలో చర్చించాడు. గ్రామాధికారుల వేతనాలు చాలా తక్కువని, వారి వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. పై అధికారులకు 'సప్లై'లు చెయ్యలేక, కొందరు గ్రామాధికారులుగా కొనసాగడానికి విముఖత చూపుతున్నారని, ఇటువంటి అవసరాలకే గ్రామాధికారులు రైతుల వద్ద అదనంగా వసూళ్ళు చేస్తారని వివరిస్తూ వారి స్థితిగతులను సానుభూతితో చర్చించాడు.36

గ్రామ సేవకులు

వెట్టిచాకిరి గురించి, వెట్టి వారి జీతబత్యాలను గురించి, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే కఠిన పరిస్థితులను గురించి నరసయ్య ఎంతో సానుభూతితో రాశాడు. “గ్రామాధికారులు గ్రామ సేవకులకు, కావలివారికి నెలనెలా చెల్లించవలసిన వేతనంలో కొంతభాగం దిగమింగకుండా సక్రమంగా చెల్లిస్తున్నారా? ప్రతి ఫలం ఇవ్వకుండా తమ పొలాల్లో గ్రామ సేవకులచేత వెట్టిచాకిరి చేయించుకోడం లేదా?” అని సూటిగా ప్రశ్నిస్తాడు.37

కుడి మరమ్మత్తు పనులు

“రైతులకు ఇబ్బంది కలిగించే నిబంధనలు విధించరాదనే సంగతి అందరికీ తెలిసినదే. ఆచరణలో అట్లా జరగడం లేదు. రెవెన్యూ అధికారులు పేద రైతులను కుడి మరమ్మత్తు పనులకు రమ్మని వేధిస్తున్నారు. బలవంతంగా పనులకు మళ్ళించుకొని పోతున్నారు. పనులకు వెళ్ళకుండా ముఖంచాటు చేసిన రైతులను అనేక విధాలుగా పీడించి జుల్మానాలు వసూలు చేస్తున్నారు. ఈ విధమైన జుల్మానాలను భూమిశిస్తు బకాయి మాదిరే వసూలు