పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

దంపూరు నరసయ్య


కౌలుకిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే కౌలుదారీ చట్టంతేవాలని ఒక రైతు రాసిన ఉత్తరాన్ని కూడా నరసయ్య తన పత్రికలో ప్రచురించాడు.41

జమిందార్లకు వ్యతిరేకం

1888లోనే నరసయ్య వెంకటగిరి జమీందారీ రైతుల సమస్యలను గురించి పీపుల్స్ ఫ్రెండ్‌లో ప్రస్తావించాడు.42 పత్రికాధిపతులు జమీందార్ల ప్రాపకంకోసం, పోషణకోసం పడిగాపులు కాస్తున్న రోజుల్లో ఇంపార్షియబుల్ ఎస్టేట్ యాక్టు (Impartiable Estate Act)ను నరసయ్య తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆనాటి పత్రికలేవైనా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాశాయా అని పరిశోధించవలసిన సందర్భంలో ఆయన ఎంత ముందుచూపుతో ఈ వ్యాసం రాశాడా అని విస్మయపడక తప్పదు.

ఎంత ప్రాచీన చరిత్ర కలిగిన ఎస్టేట్లనైనా జమీందార్లు తమ చిత్తం వచ్చినట్లు అన్యాక్రాంతం చెయ్యడం చెల్లుబాటవుతుందని పిఠాపురం ఎస్టేటు కేసులో ప్రీవీ కౌన్సిలు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు విజయనగరం, వెంకటగిరి, బొబ్బిలి వగైరా పెద్ద జమీందార్లను కలవరపెట్టింది. తమ ఎస్టేట్లు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోడానికి ప్రభుత్వాన్ని ఆశ్రయించి “ఇంపార్షియబుల్ ఎస్టేట్ యాక్టు” చట్టం చేయించుకొన్నారు.43 బొబ్బిలి, వెంకటగిరి తదితర జమీందార్లు ఈ బిల్లు పాసు కావడానికి తమ పలుకుబడినంతా ఉపయోగించారు. “ప్రభుత్వం పేదరైతుల గోడు పట్టించుకొని వారి బాధలు నివారించడం కోసం ఒక్కచట్టమైనా తీసుకొని రాలేదు గాని, జమిందార్ల సంక్షేమం కోసం, వారికి అనుకూలమైన చట్టాలు తీసుకొని వస్తూంది. ఇంపార్షియబుల్ ఎస్టేట్ యాక్టు 'రెట్రాస్పెక్టివ్' గా అమలయ్యేటట్లు చట్టం తెస్తున్నారని వింటున్నాము. ఈ విధంగా చట్టం తేవడం న్యాయంకాదు. అనాదిగా అవిభక్తంగా ఉన్న జమిందారీలకు మాత్రమే ఈ చట్టం వర్తింపచెయ్యాలి. ఈ జమిందార్లు ప్రభుత్వానికి, ప్రజలకు ఏమి ఉపకారం చేశారు?. భవిష్యత్తులో ఏమి మంచి చెయ్యబోతారు? వీరి ఎస్టేట్లు సాధారణమైన ఎస్టేట్లమాదిరే అవసరం ఏర్పడినపుడు విభజించుకోడానికి వీలుగా ఉండడమే న్యాయం. జమిందార్ల ఎస్టేట్లు అవిభాజ్యంగా ఉండేటట్లు చట్టం చేసేటట్లయితే, శ్రోత్రియందార్ల శ్రోత్రియాలు, ఇనాందార్ల ఇనాములు, సాధారణ పట్టాపొలాలు అన్నీ అవిభాజ్యంగా ఉండేటట్లు చట్టంచెయ్యాలి” అని బిల్లును వ్యతిరేకిస్తూ వ్యంగ్యం, పరిహాసం ఉట్టిపడేటట్లు రాశాడు.44

జమీందారీ భూముల సర్వే

నరసయ్య తన పత్రిక ద్వారా జమీందార్లకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం సాగించినట్లు తోస్తూంది. 1801 లో పర్మినెంటు సెటిల్మెంట్లు జరిగినప్పుడు, జమీందారీ గ్రామాలలో గ్రామకరణాల నియామకం, వారి జీతబత్యాలు, వారిమీద అధికారం అన్నీ జమీందార్ల