పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

117


జమాబంది పేరుతో నడిచే మోసాలను వివరిస్తాడు.28

గ్రామాధికారులు

ప్రభుత్వ యంత్రాంగంలోని దోపిడి పద్ధతులను నరసయ్య క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఆయన గ్రామాధికారుల వ్యవస్థను వ్యతిరేకించాడు. “గ్రామాధికారులు మహాబలవంతులు, వారే సర్వాధికారులు. పంట పొలాలను పరిశీలించకుండానే చిత్తం వచ్చినట్లు సెస్సులు ప్రతిపాదిస్తారు. వారు ఎంత అంటే అంత మొత్తం రైతు చెల్లించాల్సిందే. వారు రాసే లెక్కలు కాకిలెక్కలు. రికార్డులో నమోదుచేసిన మొత్తంకంటే అదనంగా వసూలు చేసిన డబ్బును గ్రామాధికారులు, రెవెన్యూ అధికారులు తలా ఇంత పంచుకొంటారు” అని వారి వ్యవహారాన్ని బయటపెడతాడు.29 రెవెన్యూశాఖలో అక్రమార్జన గురించి తెలుసుకోడానికి సి. రంగాచారి రాసిన “రెవెన్యూ బ్రైబరి” (Rev. enue bribery) గ్రంథాన్ని పరిశీలించమని పై అధికారులకు సూచిస్తాడు. ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన ఏ దివాన్ బహదూరు రఘునాథరావునో, పళ్ళె చెంచలరావునో అన్ని జిల్లాలకు పంపి, రెవెన్యూశాఖ అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతాడు.30

“పరిపాలనలో లోపాలున్నాయని రాస్తే మీకు కోపం వస్తుంది. మేము రాసే ప్రతి అంశానికి సాక్ష్యం తెమ్మంటే పేదవాళ్ళు ఎక్కడ నుంచి సాక్ష్యం తెస్తారు? సత్యమైన సంగతే అయినా ప్రతిదీ నిరూపించడం సాధ్యంకాదు. ప్రభుత్వమే విచారించుకోవాలి” అని రెవెన్యూశాఖ అవినీతిని గురించి వ్యాఖ్యానిస్తాడు. ఆ రోజుల్లో లంచగొండి అధికారులు నరసయ్య పేరుచెప్తేనే హడలి చచ్చేవారని సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు డాక్టరు నేలటూరు వెంకటరమణయ్య ద్వారా తెలిసింది.31

గ్రామకరణాలు

“తప్పుడు లెక్కలు రాయడంలో గ్రామకరణాలు అసాధ్యులు. వీరి దొంగలెక్కల వల్ల రైతు ప్రాణాలకు వస్తుంది. కరణాలు పొలాలకు వెళ్ళి పరిశీలించరు. ఇష్టం వచ్చినట్లు పంటల వివరాలు నమోదుచేస్తారు. వీరు నమోదుచేసిన రకరకాల శిస్తులను, సెస్సులను పై అధికారులు ఆమోదిస్తారు. కరణాల మోసాలు పసిగట్ట గలిగిన అధికారులెవరూ ఉండరు. ఈ మోసాలను జమాబంది అధికారికూడా కనిపెట్టలేడు. రెవెన్యూశాఖ నిబంధనలమూలంగానే అధికారులు అవినీతి పరులవుతున్నారు. గంజాం, నెల్లూరు, కడప కరణాలు పెద్ద అవినీతి పరులని ప్రభుత్వానికి తెలుసు” అని 1897-99 అడ్మినిస్ట్రేషన్ రిపోర్టు (Administration Report) నుంచి వివరాలు వెలికి తీసి చూపాడు.32