పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

దంపూరు నరసయ్య

రెవెన్యూ వ్యవస్థ

రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను నరసయ్య నిర్దాక్షిణ్యంగా విమర్శించాడు. ఈ వ్యవస్థలోని అమానుషత్వాన్ని ఎండగట్టాడు. “మద్రాసు పరగణాలోని రైతులు నిరుపేదలు. ఈ పరగణాలో రైత్వారీవిధానం మహాసంక్లిష్టమైనది. ఈ వ్యవస్థ భూకామందులకు, కరణాలకు, రెవెన్యూ అధికారులకు దోచుకోడానికి అనుకూలమైనది. బొంబాయి పరగణాలో భూమి సర్వేచేయించినట్లు ఇక్కడ కూడా తిరిగి సర్వేచేయించి రైత్వారివిధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టాలి. పేదరైతుల దారుణ జీవన స్థితిగతులను పత్రికల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం అనుకూలంగా స్పందించాలి” అని పేదరైతుల తరఫున వకాల్తా తీసుకొంటాడు.26

జమాబంది

“రెవెన్యూ అధికారులూ, గ్రామాధికారులూ కలిసికట్టుగా రైతులను కొల్లగొట్టేవిధానం జమాబంది” అని, జమాబంది పేరుతో సాగే నాటకాన్ని బయట పెట్టాడు. “రెవెన్యూ అధికారుల దండుగమారి చాకిరి జమాబంది” అని కూడా ఎగతాళి చేస్తాడు. “ఇది కొరగాని కార్యక్రమం. ప్రజలకు జమాబంది అధికారులెవరో తెలియదు. గ్రామాధికారులు, తాలుకా హుజూరు అధికారులు వృథాగా శ్రమిస్తారు. జమాబంది కర్చంతా రైతులనెత్తిన రుద్దుతారు. జమాబందిలో మంజూరుచేసిన పట్టాలను రైతులకు ఇవ్వరు” అని జమాబంది పేరుతో సాగే తంతును పేర్కొంటాడు.27 “రైత్వారీ విధానంలో ప్రతి రైతుకు ఏటా భూమిపట్టాలు ఇస్తారు. రైతులు చెల్లించవలసిన శిస్తులు, సెస్సులు మొదలైన వివరాలు ఈ పట్టాలలో పేర్కొంటారు. ఈ పట్టాలు జారీచేసే కార్యక్రమానికి మరో పేరు 'జమాబంది'. జమాబంది నిర్వహించిన అధికారి రైతుల విన్నపాలు ఓపికగా వింటున్నాడా? మా ఎరుకలో అటువంటి అధికారులు లేరు. జమాబంది చాలా సంక్లిష్టమైన కార్యక్రమం. దీన్ని నిర్వహించే అధికారిలో ఎంతో ఓర్పు, సుగుణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవారు ఈ రోజుల్లో అరుదు. అందువల్ల మేము శాశ్వత పట్టాలిమ్మని ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నాము” అని రాశాడు. అంతేకాదు “రైత్వారీ విధానంలో రైతు ఏటా ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తూంది. జమాబందిలో గ్రామాధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, హుజూరు సేవకులు, గుమాస్తాలు లాభపడతారు. శిరస్తదార్లు, తాసిల్దార్లు, ఇతర జమాబంది అధికారులు రైతులవద్ద బత్తాలు పుచ్చుకొంటారు. వారికి అనేకరూపాల్లో సప్లైలు అందుతాయి. రైతులు తెలివిమీరి నడుచుకొంటే తప్ప, వారికి ఏదీ జరగదు. జమాబందిలో మంజూరు చేసిన పట్టాలు చేతికిరావు. కోడూరు గ్రామాధికారి ఈ పత్రికా సంపాదకుడికి పట్టాలు అందచేసిన పాపాన పోలేదు.” అంటూ