పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

దంపూరు నరసయ్య


ఒంగోలు వెంకటరంగయ్య మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న కాలంలో సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఆయనకు మద్రాసులోనే నరసయ్య పరిచయం అయినట్లుంది. నరసయ్య నెల్లూరు వచ్చి, స్థిరపడిన తర్వాత ఈ పరిచయం స్నేహంగా మారింది. “నా ప్లీడరు ఓ.వి.ఆర్” అని నరసయ్య దినచర్యలో రాసుకొన్నాడు. నెల్లూరులో నరసయ్య కోర్టు కేసులన్నీ వెంకటరంగయ్య వాదించాడు. నరసయ్య జీవిత చరమాంకాన్ని సన్నిహితంగా ఉండి పరిశీలించాడు. “కొందరు నెల్లూరు గొప్పవారు' శీర్షిక పేరుతో కొంతమంది పెద్దల జీవితాలను, కృషిని గ్రంథస్థం చేసిన ఆయన, తన పుస్తకరచనా ప్రణాళికలో నరసయ్యను చేర్చుకోలేదు. “కొందరు నెల్లూరు గొప్పవారు” లో నరసయ్య జీవితాన్ని గ్రంథస్థం చేసి ఉంటే, మనకు ఒక సాధికారికమైన జీవితచరిత్ర మిగిలి ఉండేది. నరసయ్య చనిపోయిన పదమూడు సంవత్సరాల తర్వాత, వెంకటరంగయ్య ఆంధ్రసాహిత్య పరిషత్పత్రికలో నెల్లూరుమండల పత్రికల చరిత్ర వివరిస్తూ వ్యాసం రాశాడు.1 ఈ వ్యాసంలో నరసయ్య జీవితవివరాలను, కృషిని సంగ్రహంగా, పదివాక్యాలలో వివరించాడు. ఈ నాలుగు మాటలే నరసయ్యను గురించి పరిశోధించడానికి దారిచూపాయి. అది వేరే సంగతి.

నరసయ్య పోయేనాటికి, ఆయన కుమారుడు రామకృష్ణయ్య ఇరవై రెండేళ్ళవాడు. యుక్త వయస్సు వచ్చేదాకా, బడికి పోకుండానే తండ్రి శిక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకొని సమర్దుడయ్యాడు. తండ్రి తదనంతరం పీపుల్స్ ఫ్రెండ్ ముద్రణాలయాన్ని నిర్వహించాడు. ఇరవైనాలుగోఏట ఒక నవల రాసి ప్రచురించాడు. తండ్రి జీవితం, కృషి, కష్టాలు అన్నీ తనకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచీ తండ్రి ఉత్తరప్రత్యుత్తరాలు, రాతకోతలు, అన్నీ తానే చూచాడు. తండ్రితోపాటు తానూ కష్టాలు అనుభవించాడు. వెంకటగిరిలో ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ రెండు మూడు పత్రికలకు విలేకరిగా పనిచేశాడు. తండ్రిని గురించి ఇంత బాగా తెలిసినా, తాను జర్నలిస్టు, రచయిత అయిఉండీ, ఆయనను గురించి ఒక్కమాట కూడా రాయలేదు. విషాదం అంతా ఇక్కడే ఉంది.

రామకృష్ణయ్య తన హయాంలో నరసయ్య వ్యక్తిగత గ్రంథాలయం, పత్రికల సంపుటాలు వగైరా రికార్డంతా భట్టారంవారి కండ్రికలోని (నెల్లూరుజిల్లా) సొంత ఇంట్లో జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. తండ్రి పుస్తకసంచయంలో కొంతభాగాన్ని వెంకటగిరి ఆర్.వి.ఎం. హైస్కూలుకు బహూకరించాడు.2 రామకృష్ణయ్య మరణించిన తర్వాత, ఆయన కుమారులు (నరసయ్య మనుమలు) నెల్లూరులో బాడుగఇళ్ళలో కాపురం ఉన్నారు. ఇల్లు మారినపుడల్లా పాత పుస్తకాలు, రికార్డు 'పడేస్తూ వచ్చారు. ఆ విధంగా నరసయ్యకు సంబంధించిన ఆధారాలన్నీ కనిపించకుండా పోయాయి.

నరసయ్య తన జీవితచరిత్రను సంగ్రహంగా అరవై పేజీల పుస్తకంగా రాసిపెట్టాడు. ఆ రాతప్రతిని కూడా ఆయన వారసులు కాపాడుకోలేకపోయారు.3 నరసయ్య క్రమశిక్షణతో