పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

103


జీవిత ప్రతిబింబాలని కనుగొన్నాడు. కన్యాశుల్క నాటకాన్ని రంగస్థలంమీద ప్రదర్శనగానే కాక, సహృదయులు పఠించికూడా ఆనందిస్తారని భవిష్యద్వాణిని వినిపించాడు. పండితులకు ప్రీతిపాత్రమైన కృతక గ్రాంథిక భాషను విడిచి పెట్టి, జీవద్భాషలో నాటకరచన చేసినందుకు హృదయపూర్వకంగా అభినందించాడు.

నరసయ్య, గురజాడ ఇద్దరూ ఉదార పాశ్చాత్య విద్యావిధానం ప్రభావంలో వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొన్నారు. నరసయ్య విద్యార్థి దశనుంచి ఇంగ్లీషు సాహిత్యంతోపాటు రాజకీయ, ఆర్థిక శాస్త్రాలను, చరిత్రను నిశితంగా అధ్యయనం చేశాడు. తనకు పాశ్చాత్య రూపక సంప్రదాయాలతో గాఢపరిచయం ఉంది. అందుచేతనే కన్యాశుల్క నాటకాన్ని అంతగా అభిమానించి ఆహ్వానించాడు. గురజాడ కన్యాశుల్క నాటక రచనలో వాడిన భాషను ఆమోదించాడు. నరసయ్య వ్యావహారికభాష ప్రాముఖ్యాన్ని, ప్రయోజనాన్ని 1870 ప్రాంతాలకే గుర్తించాడు. నెల్లూరు కలెక్టరాఫీసులో అనువాదకుడుగా ఉన్న రోజులలోనే భాషా విషయంలో, ఆయన అభిప్రాయాలలో మార్పు వచ్చి ఉంటుంది. వెంకటగిరి జమిందారు సర్వజ్ఞకుమార యాచేంద్ర సాన్నిహిత్యంగూడా ఇందుకు కారణం. కొక్కొండ మొదలైనవారు వీరగ్రాంథిక భాషలో పత్రికలు వెలువరిస్తున్న కాలంలో నరసయ్య ప్రజల భాషలో తెలుగు పత్రిక తీసుకొని రావడానికి ప్రయత్నించాడు. పత్రికల భాషమీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. 1883 డిసెంబరు 1వ తేది పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో ఈ ప్రకటన వేశాడు :

“నయమైన తెలుగు న్యూసు పేపరు"

ఇంగ్లీషులో ప్రకృత మందు ప్రచుర పరుస్తూ వుండే "పీపుల్స్ ఫ్రెండ్” వలెనే లోకులకు కావలసినటువంటిన్ని వారికి హితములయినట్టిన్ని అన్ని విషయములు కలిగి తెలుగు దేశస్థులు యేలాగున మాట్లాడుదురో ఆలాగే సులభ శైలిగా వ్రాయబడి నయమైన ప్రతి వారపత్రిక కోరే వారందరు ఆలస్యములేక తమపేరు, విలాసములు మాత్రము మాకు పంపించవలెను. పేపరు చందా పోస్టేజీతో సం||కు 3 రూపాయలు. మాసమునకు 4 అణాలు. పేపరు వారమునకు ఒక తూరి (2) రాయల్ ఫారములు అనగా " పీపుల్స్ ఫ్రెండ్”లో వుండే మాదిరి ఒక కాగితము అచ్చు వేయబడును.

1882 నవంబరు నెల 1 తేది

దంపూరి నరసయ్య”

చెన్నపట్టణం

సామినేని ముద్దు నరసింహం, సర్వజ్ఞకుమార యాచేంద్ర, వాడుక భాషకు ఉన్న శక్తిని గ్రహించి తమ వచన రచనల్లో ఉపయోగించారు. తొలి తెలుగు పత్రికలు వాడుకభాషలో వెలువడ్డాయి. 1842-58 మధ్య వెలువడిన వర్తమాన తరంగిణి వాడుక భాషలోనే వెలువడింది. ఈ సంప్రదాయం నరసయ్యకు పరిచయమైనదే. ఆయన ఎంతో