పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

దంపూరు నరసయ్య


ముందుగా పత్రికలు ప్రజల భాషలో ఉండాలని గ్రహించిన క్రాంతదర్శి. తాను నడిపిన తెలుగు పత్రిక ఆంధ్రభాషా గ్రామవర్తమానిని వాడుక భాషలోనే తీసుకొని వచ్చాడు. సాంఘిక, భాషా విషయాలలో నరసయ్యకు నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన తన సమకాలికులకంటే ఎంతో ముందుగా మార్పును పసికట్టి ఆహ్వానించాడు. నరసయ్య కన్యాశుల్క నాటకం మీద రాసిన సమీక్షకు అనువాదం :-

“సాహిత్య విషయాలలో శ్రీ అప్పారావు మౌలిక భావాలు కలిగిన ప్రతిభావంతుడని అనిపిస్తాడు. తన హాస్యరస నాటకం కోసం తెలుగు పండితులకు ఎంతో ప్రీతిపాత్రమైన భాషను, కృతకంగా ఉండి పాండిత్యాడంబరాన్ని ప్రదర్శించే భాషను, ఛాందస సాహిత్యభాషను విడిచిపెట్టాడు. పండితులు నిష్కారణంగా ప్రశస్తమైనదని భావించే భాషను, వారు గ్రంథాల్లో వాడుక చేస్తున్న భాషను విడిచిపెట్టాడు. ఈ భాషకు బదులు ఇప్పుడు ప్రెసిడెన్సీ ఉత్తర జిల్లాలలో అన్ని వర్గాల ప్రజల నిత్యజీవితంలో వాడుకలో ఉన్న సరళ సామాన్య భాషను ఉపయోగించాడు. నాటక రచనలో ఈ పుస్తకం తెగువ ప్రదర్శిస్తూ కొత్త పుంతలు తొక్కింది. ఇంకా చెప్పాలంటే, తెలుగు గ్రంథరచనలో కొత్తదిశను నిర్దేశించింది. మార్పు లేకుండా, విసుగు పుట్టిస్తూ ఒకే ఇరుకు గాడిలో సాహిత్య ధోరణులు సాగుతున్న ఈ కాలంలో నాటక రచయిత గర్వించదగిన, సాహిత్యపరమైన సాహసోపేతమైన ధైర్యాన్ని ఈ రూపకం ప్రదర్శిస్తున్నదని మేము భావిస్తున్నాము. పూర్వపు ఔన్నత్యం కోల్పోయి, దిగజారిపోయిన ఈ నిస్సారమైన క్షీణయుగంలో, హాస్యాస్పదంగా పరిణమించిన వ్యాకరణ సాహిత్య శాస్త్రాలను రచయిత లెక్కపెట్టలేదు. తెలుగు రచనలో వ్యవహారంలో ఉన్న వ్యాకరణ సాహిత్య సంబంధమైన అంధ విశ్వాసాల నుంచి బయటపడ్డాడు. పూర్వ రచయితల వాడుకవల్ల లభించే సమర్థన లేకపోయినా, ఈ నాటకకర్త కొత్త సాహిత్యభాషను ధైర్యంగా వాడుక చేశాడు. ఈ భాష విశ్వజనీనమైన వాడుక వల్ల ప్రజామోదాన్ని పొందింది. ఈ నాటక రచయిత అపూర్వము, ఆసక్తికరమూ అయిన ఇతివృత్తాన్ని ఎన్నుకొని నిస్సందేహంగా తన ఉపజ్ఞను ప్రదర్శించాడు. రంగస్థలంపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే, ఏ తెలుగు ప్రేక్షకులనైనా సంతోషపెట్టగల వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే వైవిధ్యంగల పాత్రలను సృష్టించాడని మేము నమ్మకంగా చెప్పగలం. పఠనాసక్తి గల చదువరులు విశ్రాంతిగా తమ గదిలోనో, గ్రంథాలయాల్లోనో కూర్చొని చదివినా, కన్యాశుల్క నాటకాన్ని ఆనందించగలరు. అందువల్ల ఈ నాటకాన్ని చదవమని మా తెలుగు పాఠకులందరికీ సంతోషంగా సిఫార్సు చేస్తున్నాము. ...............రచయిత పాత్రలన్నింటినీ సాహసంతో చిత్రీకరిస్తూ, అసామాన్యమైన సృజనాత్మకతనూ, రూపకశిల్పాన్ని ప్రదర్శించి, నాటకాన్ని సమగ్రంగా, కళాత్మకంగా నిర్మించాడు. (ది పీపుల్స్ ఫ్రెండ్, జనవరి 21, 1897).65