పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

దంపూరు నరసయ్య


చిత్రణ ఈ నాటకంలో ఉందని, హాస్యం ఉట్టిపడే నాటకమని, తెలుగు హార్పు (Telugu Harp) పేర్కొన్నది. పాత్ర చిత్రణలో నూతనత్వం, సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలు, ఇతివృత్త నిర్వహణలో నేర్పు అనే అంశాలను ఒకటి రెండు సమీక్షలు ప్రస్తావించాయి.

ఈ సమీక్షల్లో "ఎక్కువ భాగం భాషను గురించి తమ అనుమానాలు వ్యక్తం చేశాయి.” “1897-1915 మధ్య కాలంలో వచ్చిన కన్యాశుల్క విమర్శలను 'సమీక్షదశ' అనవచ్చు” అని, “భాషా విషయకమైన సుదీర్ఘచర్చలు, సలహాలు సందేహాలు - వీటిని గమనిస్తే ఈ సమీక్షదశ మొదట్లో - 1897లో - అముద్రిత గ్రంథ చింతామణి చేసిన విమర్శకు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రిగారు 1915వ సంవత్సరం చేసిన విమర్శ పొడిగింపు అనే అనవలసి వస్తుంది.” అని 1999లో "కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం” గ్రంథ సంపాదకులు భావించారే తప్ప, “అప్పారావు హృదయాన్ని సాకల్యంగా ఆవిష్కరించిన సమీక్ష మద్రాసు నుంచి దంపూరు నరసయ్య వెలువరిస్తూ వచ్చిన పీపుల్స్ ఫ్రెండ్ లో 1897 జనవరిలో అచ్చు పడింది.” అని ఈ విమర్శకులకంటే ఎంతో ముందుగా కె.వి. రమణారెడ్డి వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. రమణారెడ్డి మాటలను శ్రద్ధగా చదివి ఉంటే, నరసయ్య కన్యాశుల్క సమీక్షను, ఆనాటి ఇతర పత్రికలలో వచ్చిన సమీక్షలను ఒకేగాట కట్టి ఉండరు. రమణారెడ్డి అభిప్రాయమే కాదు, నరసయ్య సమీక్ష గురజాడకు కూడా ఎంతగానో నచ్చింది. 1909 కన్యాశుల్క నాటకం ప్రతిలో ఆయన తొలి ముద్రణ మీద వచ్చిన సమీక్షలను చేర్చాడు. అన్నిటికన్నా ముందు పీపుల్స్ ఫ్రెండ్ సమీక్షను వేసుకొని, నరసయ్యపై తనకున్న గౌరవాన్ని వ్యక్తపరచాడు. నరసయ్య ప్రతిభా పాండిత్యాలమీద, శేముషిమీద గురజాడకు గౌరవం ఉంది. ఒంగోలు ముని సుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలో “ఆంగ్లభాషలో ఆయన గొప్ప పండితుడు” అని ప్రస్తుతించాడు. తెలుగుదేశంలో ఒక పుస్తకాన్ని సమీక్ష చేయగలసత్తా ఉన్నవారెవరూ లేరని రాస్తూ, ఆ సందర్భంలో నరసయ్య పేరు గుర్తు తెచ్చుకొని, “ఆయన జీవించి ఉన్నారా? ఉంటే ఆయన చిరునామా తెలియచేయి. ఆయనను కలుసుకో” అని రాశాడు. కొత్తగా అచ్చయిన కన్యాశుల్క నాటకం ప్రతిని (1909 ముద్రణ) నరసయ్యకు పంపాలనే కోరికతోనే, గురజాడ ఆయన చిరునామా వాకబు చేసినట్లు తోస్తుంది. నరసయ్య కన్యాశుల్క సమీక్ష గురజాడ హృదయంలో శాశ్వతంగా గుర్తుండి పోయిందని చెప్పడానికి ఈ ఉత్తరమే సాక్ష్యం .

కన్యాశుల్క నాటకంలోని మౌలికాంశాలను తరచి చూచిన సద్విమర్శకుడు నరసయ్య. ఆయన గురజాడ నాటక రచన లక్ష్యాలను, అనుసరించిన నూతన మార్గాలను గుర్తించాడు. చిరకాలంగా వాడుకలో ఉన్న నాటక రచనా సంప్రదాయాలను గురజాడ తృణీకరించాడని గ్రహించాడు. మొత్తం తెలుగు గ్రంథ రచనలోనే ఈ నాటకం కొత్త పుంతలు తొక్కిందని ప్రస్తుతించాడు. కన్యాశుల్కం ఇతివృత్తం అపూర్వమైనదని, ఆ నాటక పాత్రలు యథార్థ