పుట:Endaro Wikimedianlu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనువాదానికి ఆది గురువు

వికీపీడియాలో మంచి కృషి చేసిన మహిళా వికీపీడియన్లలో మీనా గాయత్రి ఒకరు. 2014 నుండి 2018 వరకు విస్తృతంగా రాసారు. వికీపీడియా అనువాద పరికరాన్ని విస్తృతంగా వినియోగించి తెవికీలో వ్యాసాలను ప్రచురించిన తొలి వికీపీడియన్ ఈమె. 2018 వరకు వికీపీడియా అనువాద పరికరాన్ని వాడి సృష్టించిన మొత్తం అనువాదాల్లో మూడో వంతు ఆమె సృష్టించినవే అంటే ఆమె చేసిన కృషిని అర్థం చేసుకోవచ్చు. యంత్రాలు అనువదించిన వ్యాసాల్లో లోపభూయిష్టంగా ఉండే భాషను చక్కగా సరిదిద్ది, తేటైన తెలుగులో ప్రచురించేవారు.

చర్చల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారామె. ఎప్పుడో 2011 లో గూగుల్ ద్వారా అవకతవకలుగా అనువదించి ప్రచురించిన వ్యాసాల్లో భాష దారుణంగా ఉందనీ, వాటిని తొలగించాలనీ 2016 లో సముదాయం భావించింది. కానీ మీనా గాయత్రి ఒప్పుకోలేదు. అందరం కలిసి వాటిని సవరించుదాం అని అన్నారు. యావత్తు సముదాయమూ ఒకవైపు ఆమె ఒక్కరే ఒకవైపు! అయినా ఆమె నిలబడ్డారు. అట్నుంచి కొట్టుకురండి అంటూ ఆమె చేసిన వాదనను ఆ రోజున సముదాయంలో ఎవరూ వ్యతిరేకించలేక పోయారు. ఆ తరువాత ఆ వ్యాసాల్లో కొన్నిటిని ఆమె సవరించారు కూడా.

2016లో వంద రోజులు వంద వ్యాసాలు లక్ష్యాన్ని చేరుకుని తెవికీలో అది సాధించిన తొలి మహిళ అయ్యారు. అంతే కాదు, మరుసటి ఏడాది ప్రపంచ మహిళల మాసంలో (మార్చి) వందరోజులు వంద మహిళల బయోగ్రఫీలు రాసే “100 వికీ విమన్స్ డేస్” సవాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేశారు.

ఎందరో వికీమీడియన్లు

61