పుట:Endaro Wikimedianlu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిశ్శబ్ద విప్లవకారుడు

స్వరలాసిక గారు స్వయంగా రచయిత, గళ్ళ నుడికట్టును తయారుచేస్తారు, పుస్తక ప్రచురణకర్త, వాట్సాప్‌లో సాహిత్యం గ్రూపులను ఉత్సాహంగా నిర్వహిస్తూంటారు. వీటికి తోడు చురుకైన వికీపీడియన్ కూడా. వికీపీడియన్ అని చివరగా అన్నప్పటికీ.., వడ్డించే పెద్దాయన మావాడే కాబట్టి ఫరవాలేదు. ఆయన తెవికీలో విరివిగా కృషి చేస్తూంటారు. సముద్రం అడుగున నిశ్శబ్దంగా సాగిపోయే జలాంతర్గామి లాగా సద్దు చెయ్యకుండా పనిచేసుకుపోతుంటారు స్వరలాసిక - కొడిహళ్ళి మురళీమోహన్.

జీవితచరిత్ర వ్యాసాలు రాయడంపై ఆయనకు మక్కువ ఎక్కువ. తెవికీలో రచయితలు, సినిమాలు, సంగీతకారులు తదితర వ్యాసాలపై కృషి చేస్తారు. 2 వేలకు పైగా కొత్త వ్యాసాలను తయారు చేసారు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలలో 275 మందికి వ్యాసాలు ఉంటే అందులో 200 వ్యాసాలు స్వరలాసిక రాసినవే. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేలాది తెలుగుపాటలన్నిటినీ జాబితా చేసేపనిలో ఉన్నారు. ఇప్పటికి దాదాపు 70 శాతం పని పూర్తైంది. పాటలో తొలి పదాలు, సంవత్సరం, సినిమా, రచయిత, సంగీత దర్శకులు, సహగాయకులు వగైరా సమాచారంతో పుష్టిగా తయారౌతున్నాయి ఈ పేజీలు.

తన కృషిని తనవరకే పరిమితం చెయ్యకుండా సముదాయం మొత్తాన్నీ కూడదీసి ఒక వికీప్రాజెక్టు చేసారు. వికీపీడియా పేజీల్లో ఫొటోలు లేకపోవడం లోటుగా భావించి 2021 లో ఫొటోలు చేర్చే పోటీ పెట్టారు. మెటావికీలో మాట్లాడి ఉత్తమమైన కృషి చేసినవారికి బహుమతులు కూడా ఏర్పాటుచేసారు. పోటీకి మంచి ప్రచారం కల్పించి విజయవంతం చేసారు.

ఎందరో వికీమీడియన్లు

43