పుట:Dvipada-basavapuraanamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19

యిట్టిద కావున నీ నందికేశుఁ
డెట్టున్న నేన కా కేల యొండొకఁడె ?"
యని యాన తిచ్చుడు నఖిలాండపతికి
ననురాగమున జగదంబ కేల్మొగిచి 500
య న్నందికేశు నందంద చూచుచును
మన్నన దైవాఱ మఱియు ని ట్లనియె :
“ ఈనిరహంకార మీసదాచార
మీనిరంతరభక్తి యీ ప్రభుశక్తి
యీసిద్ధపాండిత్య మీనిత్యసత్య
మీసుకుమారత్వ మీయాత్మతత్త్వ
మీశుద్ధచారిత్ర మీపుణ్యగోత్ర
మీశుభాంచితమూర్తి యీలసత్కర్తి
యేరికిఁ గల్గునే యెన్నిభంగులను
గారవింపఁగ నీవు గానివారలకు 510
నిన్ను ధరింపంగ నీకె కా కొరుల
కెన్నంగ శక్యమే యీశ ! సర్వేశ !
అట్టిద కాక నీయంశంబు గాని
యట్టివాఁ డింత నీ కనుగులం బగునె !"
యనుచున్న గిరిరాజతనయవాక్యములు
విని ముదితాత్ముఁ డై విశ్వేశ్వరుండు
నారదుదెసఁ జూచి నందికేశ్వరుని
గౌరవమహిమ విఖ్యాతిని వింటె ? "
యనుచు నానందీశు నధికదయార్ద్ర
వనధిఁ దేల్చుచుఁ గనుఁగొనుచున్న యెడను 520
నెంతయు భయము నొక్కింతయుఁ జూపు
నెంతయు సిగ్గు నొక్కింతయు ముదముఁ
దనకు భూషణము లై తనరారుచుండ
గనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగ
సులభరోమాంచకంచుకితాంగుఁ డగుచు