పుట:Dvipada-basavapuraanamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

బసవపురాణము

దలఁపున డెందంబు దటతట నదర
మస్తకవిన్యస్తహస్తుఁ డై తన్నుఁ
బ్రస్తుతింపుచు నున్న ప్రభు నందికేశుఁ
గనుసన్నఁ జేసన్నఁ గదియంగఁ బిలిచి
తననిర్మలప్రసాదముఁ గృపచేసి 530
నెయ్యంబుఁ గరుణయు నిండి వెల్విరియ
నయ్యంబికాధవుఁ డతని కిట్లనియె :

—: శివుఁడు నందికేశ్వరుని మర్త్యమున బసవేశ్వరుఁడుగా జనింపఁ బంపుట :—


“ఇది శ్రుతిస్మృతిమూల మిది ధర్మశీల
మిది విమలాచార మిది తత్త్వసార
మిది సుమహాతత్త్వ మిది కృతార్థత్వ
మిదియాదిపథ మని విదితంబు గాఁగ
నీకతంబునన నిర్ణీత మై భక్తి
లోకంబునం దవలోకింపఁ బడియెఁ ;
బ్రమథాధిపతులకుఁ బార్వతీసతికి
విమలమదీయతత్త్వముఁ బ్రబోధించు540
తెఱఁగునకంటెను దెల్లంబు గాఁగ
నెఱిఁగించితిమి నీకు నెక్కుడుఁ గూర్మి
నట్టిద ; సర్వజ్ఞుఁ డను పేరు నీకు
నిట్టట్టు నా వల దెల్లచోఁ జెల్లు ,
గాన యామర్త్యలోకమ్మున కరిగి.
పూని ద్వితీయశంభుం డన మహిమ
వ్యక్తిగా లోకహితార్థంబు సకల
భక్త హితార్థంబు పరమార్థముగను
మావినోదార్థంబు మర్త్యంబుఁ బరమ
పావనంబుగఁ జేయుఁ బసవఁ డన్పేర" 550
నావుడుఁ గేల్మోడ్చి నందికేశ్వరుఁడు
దా విన్నపము చేసే దేవదేవునకు ;