పుట:Dvipada-basavapuraanamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xliii

కూటమే ! సోమనాథుఁడు వీరశైవమునకు పండితత్రయ సంప్రదాయము వలన గల్పించిన యౌన్నత్యమునకు వారి గుర్తింపే యీసత్కృతి.

“ఖ్యాతిగా సద్భక్త గణలాలనముగ-నూతనంబుగ జగన్నుతముగా మున్ను
 'బసవపురాణ' మొప్పఁగ రచించితివి; బసవపురాణ ప్రబంధంబునందు
 ప్రథిత పురాతన భక్త గణాను-కథనంబు రితిహాస ఘటనఁ గూర్చితివి ;
 వరవీరభక్తి సవైదికంబుగను-విరచించితివి 'చతుర్వేద సారము'న ;
 బస వన్న మహిమ శుంభద్భక్తియుక్తిఁ-బ్రసరించితివి గద్యపద్యాదికృతుల ;
 నర్ణవావృత ధాత్రియం దొప్పు బసవ-వర్ణనల్ సేసితి వరుసన వీను
 లారంగ గురుమల్లి కార్జున పండి-తారాధ్యుల చరిత్ర మర్థి వర్ణింపు :
 పరిశిష్ట పరిమిత ప్రాక్తన భక్త -చరితంబు లితిహాస సంగతి నొలయ
 సంధింపు పండిత చరితంబునందు " (పండితారాధ్య చరిత్ర--అవతారిక)

అని భక్తుల యాజ్ఞ. పూర్వము “రచియింపు బసవపురాణంబు నీవు" అనిన వారు ఇప్పుడు "సంధింపు పండిత చరితంబు" అనినారు. జంగమలింగా కృతులుగా బసవ పండితులు శివాకృతు లయ్యును జన్మచే నొకరు బసవావ తారులు; మఱియొకరు ప్రమథావతారులు . శివుఁ డన్నను బసవఁ డన్నను భేదము లేదని వీర శైవ మత తాత్పర్య మగుచుండగాఁ బండితుని బురాణ పురుషుఁ డగు బసవనిగా నిరూపింపరాదు. కావున నాతని చరిత్ర మొక యితిహాసము కావలెనని వారి నిష్కర్ష. ఇతిహాసము "శాస్త్రరూప కావ్యచ్ఛాయాన్వయిని" కావలె ననికదా ధ్వన్యాలోక మతము. అప్పు డది యుపదేశోపరంజకత్వ సామర్థ్యము సంతరించుకొనును. పండితారాధ్య చరిత్ర మట్టి పాకమునఁ బడినది. వృద్ధ సోమనాథుని పండిన బుద్ధి దానిని సర్వతోముఖ శేముషితో సమలంకృత మొనర్చినది.

పండితారాధ్య చరిత్రము దీక్షాపురాతన వాద మహిమ పర్వత ప్రకరణములుగా విభక్త మై యున్నది. వీరమాహేశ్వరాచారుని జీవితము పంచాచార పంచావరణ నిబద్ధమైనట్లే పండితారాధ్య చరిత్రమును పంచప్రకరణ ప్రసిద్ధమైనది. ఇందు పండితచరిత్రము ప్రధాన ప్రతిపాద్య మైనను బసవని యొక్కయు పరిశిష్ట భక్తుల యొక్కయు చరిత్రములు కీర్తితము లైనవి. పాండిత్య వీరమున కాలంబన మైన ఆరాధ్య జీవితమున చతుర్వేద పారగుఁ డైన సోముఁడు సార్థకముగా మతశాస్త్రార్థసంపత్తిని నింపిపెట్టినాఁడు. దీనికి