పుట:Dvipada-basavapuraanamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xliv

శ్రోత పాల్కురికి సూరామాత్యుఁడు. సవైదిక మైన వీర శైవ భక్తితత్త్వ మిందు పరమతాప్పర్యము. అదియే బసవనితత్త్వమని వ్యాఖ్యానించినవాఁడు పండితుఁడు. తచ్చరిత్రమున దానిని మిత్రసమ్మితముగా నుపదేశించినవాఁడు సోమనాథుఁడు !

కవిత్వము :

సోమనాథుని కవిత్వము ప్రసన్న గంభీర మయ్యు ధారావేగము గల్గినది. పాంచాలీవైదర్భీరీతులు గల్గి, ద్రాక్షా కదళీ పాకముల నితని రచనము చవు లూరించు చుండును. రసానుగుణ మైన గుణసంవిధాన మీతని కావ్యములందు సర్వత్ర కాననగును. భక్తి సర్వసాధారణ రస మగుటచే నీతని కవితకు ప్రసాదము సాధారణ గుణము. వీరత్వ మీతని పాత్రలకు సహజ లక్షణ మగుటచే నోజోగుణ మచ్చటచ్చట సమయోచితముగా సంతరింపఁబడును. ముగ్ధభక్తుల చరిత్రలలో మాధుర్యగుణ మప్రయత్నముగాఁ బ్రత్యక్ష మగును. బసవని పేరు తలంచిన మాత్రముననే యొడలెల్ల నాలుక లై కీర్తించు సోమనాథుఁడు బసవకీర్తనమున కవిత్వమును పరవళ్లు త్రొక్కించును. తా ననుభవించెడి భక్త్యావేశమును పఠితయందు గల్పించుటకై తన రచనమునే ప్రత్యక్ష విభావముగా రూపొందింపఁగల సామర్థ్య మీతనికి సహజసిద్ధము. పాత్రల బహి రంతఃప్రవృత్తుల నచ్చు గ్రుద్దినట్లు చిత్రింపఁగల నేర్పును, స్వాభావిక ప్రకృతి వర్ణనలను రమణీయముగాఁ దీర్చిదిద్ది కథానుగుణముగా సంధించు కౌశల్యమును, శ్రవణసుభగముగా శబ్దాలంకారములను, సహజసుందరముగా నర్దాలంకారములను సంతరించుటయును, సూక్తులను, లోకోక్తులను. జాతీయములను సార్ధకముగా వాడుటయును, అల్పాక్షరముల ననల్పార్ద రచన మొనర్చుటయును సోమనాథుని కవితాగుణములు.

రసభావముల నాయువుపట్టు లెఱింగి వానిని బోషించి కథా ఘట్టములను రక్తికట్టించుట సోముని విద్య. బెజ్జమహాదేవి శివుని లాలించు నెడ వత్సల భావమును, కన్నప్ప శివుని సేవించునెడ ముగ్గమగు భక్తిభావమును సోమనాథుఁడు మూ ర్తికట్టించిన విధ మనన్యసాధ్యము. "మాదాంబ వేఁకటి వర్ణనము (1. 644-680) ; బసవేశ్వరుని శిశులీలలు : (1. 810-850); సూర్యాస్తమయ చంద్రోదయ వర్ణనములు (3. 181-210); (3. 365-405); సంగళవ్వ కొడుకును పిలుచు ఘట్టము (4. 495-540) వృషభ వర్ణనము (5. 780-810); కపటగోపాల వర్ణనము (8. 1400-1425); బసవని విషభక్షణ ఘట్టము (7. 400-580) మొదలగునవి బసవపురాణమున రసవద్వర్ణనాఘట్టములు. పఠిత యూహ కేమియు వదలక సమగ్రముగా విభావస్వరూప స్వభావములను స్వభావోక్తులలో వర్ణించుట సోముని కవితలో సాధారణముగాఁ గాననగును. ఇందుల కితని ప్రసిద్ధ కుక్కుటవర్ణన ముదాహరణము.