పుట:Dvipada-basavapuraanamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xlii

మందలి శతరుద్రీయ మను రుద్రాధ్యాయమునకు (నమక చమకములకు) భాష్య మైయుండు నని విమర్శకులు భావించుచున్నారు. 2. సోమనాథ భాష్యము : దీనికి 'బసవ రాజీయ' మనియు, 'వీరమాహేశ్వర సారోద్ధార ' మనియు నామాంతరములు గానవచ్చుచున్నవి. శైవ సంప్రదాయ సర్వస్వమును సంస్కృతమున నిరువదియై దధ్యాయములలో శ్రుతిస్మృతి పురాణేతిహాస ప్రమాణ యుక్తముగా నిందు సోముఁడు నిరూపించెను. గాయత్రీ మంత్రము శివపరముగా నిరూపిత మగుటయు, లింగార్చన ప్రాధాన్యము నుగ్గడించుటయు నీ గ్రంథ విశేషము. వైదికాచార గర్హణ మిందుఁ చేయఁబడక పోగా దాని ప్రాధాన్య ముగ్గడింపఁ బడిన దనియు ప్రభాకర శాస్త్రుల వారు పేర్కొని యున్నారు. హరదత్తా చార్యుల చతుర్వేద తాత్పర్య సంగ్రహమునుండి సోముఁడు పెక్కు శ్లోకములను గ్రహించి యిం దుదాహరించెను. దీనికి మనోహరుఁ డను శైవాగమవేత్త సులభ వ్యావహారికాంధ్ర భాషలో రచించిన వ్యాఖ్యానము పదియవ ప్రకరణము వఱకు లభించుచున్నది.

10. ఇవికాక అన్యవాద కోలాహల మను పేరుగల సోమనాథలింగ శతకము, మల్లమదేవి పురాణము, మొదలగు తెలుఁగు కృతులు 'శీలసంపాదనము, శివగణ సహస్రనామ' యను కన్నడ కృతులను గూడ సోముఁడు రచించె నని విమర్శకులు భావించుచున్నారు,

పై రచనలలోఁ గొన్ని స్తవములు సామాన్యుల కందుబాటులో నున్నను సంస్కృత గద్య పద్యాష్టకములు గీర్వాణ సంస్కార మున్న వారికిఁ గాని యందవు. శతకోదాహరణములు సంస్కార మున్న భక్తుల నాకర్షించినను అనుభవసారాదులు సోమనాథ భాష్యాదులు శాస్త్ర పాండిత్య మున్న పండితులకు గాని యవగాహనము కావు. కావున నీ రచనలతో సోమనాథుఁడు మేధావివర్గమును మతమువైపు మఱలించుకొనుటకు యత్నించినాఁడు. పండితారాధ్య సంప్రదాయ మాతనిలోఁ బండించిన పరిపక్వ ఫలసమూహ మీకావ్య కదంబము!

సోమనాథుని సాహిత్య జీవితమునకు భరతవాక్యముగా పరిఢవిల్లినది పండితారాధ్య చరిత్రము. దీని రచనకును బోత్సాహ మిచ్చినది శ్రీశైలభక్త