పుట:Dvipada-basavapuraanamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxviii

నతని చిత్తమున హత్తుకొనినది. అతని చిత్తము బసవపురాణ రచనాయత్త మైనది.

బసవపురాణము బసవని విశుద్దభక్తి మార్గమును బ్రతిపాదించుట కేర్పడిన ప్రప్రథమ వీరశైవపురాణము. దానిని భక్తులు పాడుకొనవలె ననియు, పామరులు పురాణశ్రవణము చేయవలె ననియు, జనులహృదయములు భక్త చరిత్రముల కార్ద్రము లై బసవని భక్తిబీజములకు ఫలక్షేత్రములు కావలె ననియు రచించెను. అందువలననే అది సర్వసామాన్య మైన జానుఁదెనుఁగున జాలువారినది. దాని ప్రయోజన మది అనతికాలములోనే సాధించినది. ఆంధ్ర కర్ణాట దేశము లా పురాణమును పూవులలోఁ బెట్టి పూజించినవి; పుక్కిటఁ బట్టి కీర్తించినవి. ఇంతటి పురాణము రచించిన భక్త సోమనాథుఁడు బసవ కీర్తనమునఁ దృప్తిపడలేదు .

"ఇదియుఁ గోటికిఁబడ గెత్తిన వానిఁ
 బదివేల కాప వై బ్రదుకు మన్నట్టు
 లాపరంజ్యోతిస్స్వరూపంబునకును
 దీపకంభంబు లెత్తించినయట్లు
 భవనిర్మితము లైన సత్రపుష్పములు
 భవునకుఁ దగ సమర్పణ సేయునట్లు
 గాక కీర్తింపఁగా నాకుఁ దరంబె
 ప్రాకటంబుగ భక్త బందారి చరిత! " (ప్ర. 243-250)

అని బసవపురాణానంతరము కూడ బసవగుణమతకీర్తనాత్మకము లైన కృతుల నాతఁడు రచించుట మానలేదు. పుంఖానుపుంఖముగా నతని కలమునుండి బహు విధ సాహిత్య ప్రక్రియలు లాస్యముచేయుచు లోకమున కవతరించినవి.

సోమనాథుఁడు నిర్మించిన భక్తిసాహిత్యమున నొక విశిష్ట లక్షణము కానవచ్చుచున్నది. అది యాతని వ్యక్తిత్వమును గొంతవఱకు వ్యక్తీకరింపఁ జేయుచున్నది. అతఁడు వస్తుతః కవి. అందువలన నిరంకుశుఁడు; ఆవేశ పరుఁడు. ఆపైన భక్తుఁడు. అందుచే నతఁడు కవిత్వమును శివార్పితము, బసవార్పితము చేసెను. అతఁ డుద్దండ పండితుఁడు. అందువలస వాదములు చేసెను. వివిధ భాషలయందు. వివిధచ్ఛందములయందు, వేదవేదాంగములయందు అతఁ డార్జించిన పాండిత్యమును బహువిధ సారస్వత గ్రంథములుగా నాతఁడు నిర్మిం