పుట:Dvipada-basavapuraanamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxix

చెను. అతఁడు భక్తుఁ డగుటచే జంగమలింగరూపు లగు భక్తులు కోరినప్పుడు లోకహితార్థ మై సర్వసామాన్య మగు ద్విపదలో కావ్యము నిర్మించెను. లేనిచో నతని యిచ్చకువచ్చిన ఛందములలో నిచ్చవచ్చిన విధముగా భక్తికృతులు లిఖించు కొనెను. భక్తి కృతులతో నాగక శాస్త్ర వాఙ్మయమును గూడ నిర్మించి మతమునకుఁ బుష్టి చేకూర్చెను. శ్రీశైలమున భక్తుల యాదేశానుసారము సోమనాథుఁడు రెండు బృహద్గ్రంథములను నిర్మించెను. ఒకటి పురాణము. మఱియొకటి చరిత్రము. ఒకటి భక్తి సోపానము. మఱియొకటి జ్ఞానసోపానము. ఒకటి భక్తిరసతరంగిణి. మఱియొకటి మతశాస్త్రవిజ్ఞానమహాంబుధి. ఈ యుభయరస జగత్తుల నడుమ పూఁదోటలుగా, వనజాకరములుగా, గిరిశృంగములుగాఁ గనవచ్చు భక్తికృతులు కొన్ని కలవు.[1] అవి ప్రధానముగా గద్యలు, రగడలు, ఉదాహరణములు, అష్టకపంచకములు, స్తవములు, శతకములు, భాష్యములు.

1. గద్యలలో పంచప్రకారగద్యయు. నమస్కారగద్యయు, అక్షరాంకగద్యయు, అష్టోత్తరశతనామగద్యయు, ముఖ్యములైనవి. చిత్తసమాహితార్థమును, అక్షరమాలారూపుఁ డైన భగవంతుని స్తుతించుటకు నుద్దేశింపఁబడి నామ కీర్తనైక లక్షణవిశిష్టము లై, ఆంధ్రగీర్వాణ కర్ణాటచ్ఛంద సంప్రదాయముల ననుసరించి మాత్రాగణబద్దము లై విలక్షణముగా నిర్మింపఁబడిన కృతు లివ్వి. అక్షరాంకగద్యమున అక్షరాంక పద్యమును సోముఁడు రచించెను. అం దచ్చులతోఁ గూర్చిన యొక పద్యము గమనింపుడు ;

చ. “అమితయశస్క ఆద్యయన ఇద్రుచి ఈశ్వర ఉగ్ర ఊర్జిత
    క్రమ ఋషభాంక ౠజహర ఌసిత ౡస్మిత ఏకరుద్ర బం
    ద్రమహిత రూప ఓమితి పదద్యుతి ఔర్వలలాట అంబికా
    సమరసభావ ఆఃకలిత వర్ణనుతం బసవేశ పాహిమాం||"

ఇట్లే కకారాది క్షకారాంతము గల యొక్కొక్క యక్షరమున కొక్కక్క పద్యముచొప్పున నిందు కూర్చుట యొక భక్తివిశేషము.

2. రగడలలో బసవరగడ, బసవాడ్య రగడ, సద్గురురగడ , గంగోత్పత్తిరగడ యనునవి -

తెనుఁగుకృతులో కర్ణాటకకృతులో స్పష్టముగాఁ జెప్పఁజాలని రచనలు - కలవు.

  1. విశేషములకు శ్రీ బండారు తమ్మయ్యగారి 'పాలకురికి సోమనాథకవి' యను గ్రంథమును జూచునది.