పుట:Dvipada-basavapuraanamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxvii

విశేషవృత్తములు కూడ వాడ బడినవి. త్రిభంగిని కావ్యమున వాడిన తెలుఁగు కవి ఈతఁడేనేమో ! ఈతని యీ కావ్యనిర్మాణ పద్ధతి కన్నడ 'చత్తాణ' కావ్య మర్యాద ననుసరించుచున్న దనవచ్చును.[1] ఇతఁడు చతుర్విధ కందము లను చిత్ర కవిత్వ రచనమందును. ద్విత్రిప్రాసల ప్రయోగమునందును, అనుప్రాసాది శబ్దాలంకారములఁ గూర్చుటయందును మక్కువ యెక్కువగా నిందుఁ జూపించెను. సమతగల సీసపద్యరచనమును , ప్రథమదళమున యతిపాటించిన క్రౌంచపద వృత్తరచనము నీతని ప్రత్యేకత.

ఇందు సోమనాథుఁడు బసవనిఁ దలంపలేదు. అతని మహిమ లీతని చెవుల నప్పటి కింకను పడలేదు కాబోలు. కాని బసవనిభక్తి బీజములు నాటఁబడుట కను వైన యుత్తమ తత్త్వసంస్కార మితని చిత్తమున కబ్బినది.

ఉ. ఏపున శుద్ద భక్తి రతి నేడ్తెఱ నూల్కొన నేకలింగ ని
    నిష్ఠాపర యుక్తి నివ్వటిల సజ్జనభావము పొంగలింప సు
    ద్దీపిత తత్త్వదృష్టి మతిఁ దేజ మెలర్పఁగ సచ్చరిత్రయం
    దోపి వెలుంగు భక్తుఁడు మహోన్నతి నుండు జగజ్జనాశ్రయా : (167)

అనెడి యాతని వాక్కున నా సంస్కారము గుబాళించుచున్నది. ఇట్టి తత్త్వ దృష్టి పండితారాధ్య సాహిత్యరససిద్ధిచే నాతఁడు సాధించిన శివానంద పదసిద్ధి.

ఇట్టి యనుభవసారముతో నాతఁడు శివభక్తగణ సందర్శనార్థము దేశసంచారము చేసియుండును. భక్తకూట మగు శ్రీశైలకూట మతని చిత్తాన్నత్యమును గుర్తించి బసవనిభక్తిని అందు ప్రతిష్ఠాపించెను. అతని కప్పు డది యొక నూతనానుభవసార మైనది. అనుభవసారము నాటికే అతఁడు-

శా. “వ్రాలున్ వ్రాలు శివార్చనాపరవశవ్యాప్తిన్ బ్రమోదంబునన్
     గ్రాలున్ గ్రాలు నహర్నిశంబు శివలింగధ్యాన సంపన్నుఁ డై
     సోలున్ సోలు నపారసార వివిధ సోత్రప్రలాపంబులన్
     దేలున్ దేలు మహానుభావసుఖవార్థిం భక్తుఁ డుద్యద్గుణా :" (166)

అని చెప్పఁగలిగిన అనుభూతి గలవాఁడు. ఆపైన బసవ భక్త్యనుభూతి క్రొత్త రుచుల నిచ్చుటచే నాతఁ డంత భక్తి పారవశ్యము నందును బ్రకటించినాఁడు. పండితుని మార్గముకన్న ప్రాచీన మైన బసవనిమార్గము పురాణమార్గముగా

  1. కవిరాజమార్గము. 1. 34. 35 చూడు: (భాషాసారస్వతములు దేశి : శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు. పుట 126).