పుట:Dvipada-basavapuraanamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxviii

యుండఁదగు ననియు, నప్పు డది సోమనాథుని గురువునకు విశేషణ మగు ననియు, దీక్షానంతరము గురుగోత్రము శిష్యుఁడు తాల్చుట మతాచారమే యనియు తలంచి, “ఈ పద్యమును బట్టి సోమనాథకవి కేవలము సహజ జంగముఁ డని నిర్ధారణము చేయరాదనియు, బసవపురాణ మందలి తల్లి దండ్రుల నామములను బట్టి యాతఁడు జన్మతః జంగమేతరుఁ డై భృంగిరిటి గోత్రుఁ డగు వానిచే శైవదీక్ష నంది భృంగిరిటి గోత్రుఁడ నని యనుభవసారమునఁ జెప్పుకొనె ననియు, గురులింగ హస్త తనూజాతుఁడ నని చెప్పుకొనినవాఁడు భృంగిరిటి గోత్ర సంభవుఁడ నని చెప్పు

కొనుటకు సందేహింపఁడనియు నిశ్చయించుటయే యుభయ గ్రంథసమ్మత మగు ననియు "[1] విమర్శకులు భావించుచున్నారు. సోమనాథుఁ డారాధ్య బ్రాహ్మణుఁ డని నిరూపించుచు శ్రీ నిడుదవోలు వేంకటరావుగా రిట్లు రచించి యుండిరి : “సోమన తాను మాత్రము భృంగిరిటి గోత్రుఁడనని చెప్పియున్నాడు గాని బసవన పండితారాధ్యులకు నేగోత్రమును చెప్పలేదు. జన్మముచే బాహ్మణులై నప్పుడు వారి కేదో గోత్ర వ్యవహారము తప్పదు. సోమనాథుఁడు చెప్పకపోయినను, పండితుఁడు గౌతమగోత్రుఁడని తరువాతి గ్రంథములు చెప్పుచున్నవి. పండితారాధ్య చరిత్ర శ్రోత పాల్కురికి సూరనామాత్యుఁడు హరితసగోత్రుఁ డని సోమనాథుఁడే చెప్పియునాఁడు. అట్లే సోమనాథునికి గూడ అర్షేయమగు గోత్రముండియే తీరవలయును. అతఁడు జన్మముచే బాహ్మణుఁడని యంద రంగీకరించినదే కదా ! ఇక , పరంపరాయాత మగు జనశ్రుతిని బట్టి యాతఁడు కౌండిన్య గోత్రజుఁ డని తెలియవచ్చు చున్నది. మఱియు నాకాలమున జంగమ శబ్దము జాతివాచకము కాదు. శివభక్తు లేజాతివారైనను జంగములే. నన్నెచోడకవి గురువు “జంగమ మల్లికార్జునుఁడు" “భూసురకులతిలకుఁడు". పాల్కుఱికి సోమనాథుని గురు వగు బెలిదేవ వేమనారాధ్యుఁడు భూసురుఁడే యని పండితారాధ్య చరిత్రమునఁ గలదు. కావున బసవన, పండితారాధ్య , వేమనారాధ్యుల వలె సోమనాథుఁడును “భూసుర తిలకుఁడైన జంగముఁడే కాని వేరుకాదు. కులగోత్రముల ప్రసక్తిలేని వీరమాహేశ్వరాచారము స్వీకరించిన వెనుక సోమనాథుఁడు తత్సంప్రదాయము ననుసరించి తానీశ్వరకులజుఁ డనియు, భక్తి గోత్రుఁడ ననియు, పార్వతీపరమేశ్వరులు తల్లిదండ్రులనియు , చెప్పుకొన్నాఁడు. మఱియు భృంగిరిటి గోత్రుఁడ ననియు, గురులింగతనూజుఁడ ననియు ననుభవసారమునఁ జెప్పినాఁడు... ప్రప్రథమ

  1. కవితరంగిణి. సం. 3, పుట. 125, 126. 129