పుట:Dvipada-basavapuraanamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxix

గ్రంథ మగు ననుభవసారమున గురులింగతనూజుఁడ నని చెప్పిన సోమనాథుఁడు బసవపురాణమున తండ్రి విష్ణురామదేవుఁడని యేల చెప్పెనో యోజింపఁదగినది. ఇది ప్రజాసామాన్యమున ప్రచారము గావలసినది. సోమనాథుఁ డిందు శైవమత దీక్షగొని వెనుకధరించిన నామమును చెప్పక , తనజన్మమునకు హేతుభూతులగు తలిదండ్రుల పేళ్లు చెప్పుట యాతనిలోకజ్ఞతయే కాక తలిదండ్రుల యందలి యాతని పూజ్యభావము గూడ సూచించు చున్నది. భక్తి తన్మయత్వము చేతనైన పండితారాధ్య చరిత్రమున “మును బసవపురాణమున నెన్నఁబడిన పెనుపారు భక్తుల పెంపుడు కొడుక” అని వారిని స్మరించియే యున్నాఁడు. కాబట్టి సోమనాథుఁ డారాధ్య బ్రాహ్మణుఁ డని యంగీకరించుట సమంజసము".[1]

మఱియు 'పండితారాధ్య చరిత్రము, చతుర్వేదసారము, బసవరాజీయము మొదలగు గ్రంథములు పరిశీలించినచో వానియందు వేదమంత్ర భాష్యము లుదాహృతమై యుండుటచేతను, వైశ్వదేవాది శ్రౌతకర్మల రహస్యము లెన్నియో విమర్శింపఁబడుటచేతను, “చతుర్వేద పారగుఁడ" నని సోమనాథుఁడే పండితారాధ్య చరిత్రమునఁ జెప్పుకొనుటచేతను, బ్రాహ్మణేతరు డు వేదము చదువరాదను ప్రమాణములను సోమనాథభాష్యమున నుదాహరించుటచేతను, పలువురు కర్ణాటాంధ్ర కవులు సోమనాథుని నారాధ్యనామముతో బేర్కొనియుండుట చేతను,[2] శైవులైన బ్రాహ్మణులకే యా నామము చెల్లుచుండుటచేతను , సోమనాథుని బ్రాహ్మణత్వము నిర్వికల్పముగా నిలువగల' దని ప్రభాకరశాస్త్రిగారు స్థాంపించినారు. [3]

మహిమలు :

బసవపురాణ రచనముతో సోమనాథుని మతదీక్షతోపాటు, కవితాదీక్షయు పండబారినది. అతఁడు పురాణనిర్మాణదక్షుఁ డగుటచే నవ్యవ్యాసుఁడుగా వాసికెక్కినాఁడు.

  1. తెనుఁగు కవుల చరిత్ర. (మ. వి. ప్ర.) పుట 824-825 .

    డా. చిలుకూరి నారాయణరావుగారు సోమనాథుఁడు శివబ్రాహ్మణుఁడనియే భావించిరి. చూడు: పండితారాధ్య చరిత్ర పీఠిక. పుట. 80-85.

  2. ఉదాహరణమునకు పిడుపర్తి సోమనాథుని బసవపురాణశ్వాసారంభ పద్యములను గమనించునది.
  3. బసపపురాణము. పీఠిక పుటలు 8.13.