పుట:Dvipada-basavapuraanamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxvii

“ధర సుమామాతా పితారుద్ర' యనెడు
 వర పురాణోక్తి నీశ్వరకులజుండ !"[1]

నని చెప్పికొని తన పండిన మత సంస్కారమును బసవపురాణమున నొలుక పోసినాఁడు.

సోమనాథుఁడు పుట్టుకచే బ్రాహ్మణుఁడా? జంగముఁడా? యను సంశముపై విమర్శకులలో వాదము లున్నవి. శ్రీ బండారు తమ్మయ్యగారు సోమనాథుఁడు జంగమకులజుఁ డనియు,[2] కీ. శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగా రాతఁడు శిష్టాచార సంపన్న మైన బ్రాహ్మణకులమున జన్మించినవాఁ డనియు,[3] కీ. శే. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగా రతఁడు ఆరాధ్య బ్రాహ్మణుఁడనియు, శ్రీ చాగంటి శేషయ్యగా రాతఁడు నియోగి బ్రాహ్మణుఁ[4] డనియు నభిప్రాయపడిరి. వీ రందరికిని విమర్శకులలో అనుయాయు లున్నారు.

సోమనాథుఁడు తన ప్రథమకృతి యైన అనుభవసారమున తాను

కం. "భృంగిరిటి గోత్రుఁడను[5] గురు
      లింగతనూజుండ శివకులీనుఁడ దుర్వ్యా
      సంగవివర్జిత చరితుఁడ
      జంగమ లింగప్రసాద సత్ప్రాణుండన్. (22 ప.)

అని చెప్పుకొనినాఁడు. ఇందు భృంగిరిటి గోత్రుఁడ నని చెప్పిన వాక్యమును బట్టి సోమనాథుఁడు పంచాచార్య సంప్రదాయమునకు సంబంధించిన భృంగిగోత్రజుఁ డైన సహజవీరశైవుఁ డనియు, జన్మచే జంగముఁడనియు, నతని తల్లిదండ్రులును జన్మచే జంగము లనియు శ్రీ తమ్మయ్యగారి వాదము. కాని, “సోమనాథుఁడు జన్మతః జంగముఁడు కాఁడని యాతని తల్లి దండ్రుల నామములే వేనోళ్ల చాటుచున్నవనియు "భృంగిరిటి గోత్రుఁడను" అనుచోట “గోత్రుఁ డగు" అని

  1. చూడు: బసవపురాణము (సంక్షిప్తము) అవతారిక. 1. 145-164.
  2. బసవపురాణ పీఠిక. పుటలు. 28-50 (వావిళ్ల ప్రచురణ).
  3. బసవపురాణ పీఠిక. పుటలు. 8-13 (ఆంధ్ర గ్రంథమాల ప్రచురణ).
  4. కవితరంగిణి. సం. 3 పుటల., 122-136.
  5. పిడుపర్తి సోమనాథుఁడు తన పద్యబసవపురాణమున:

    క. భృంగిరిటి గోత్రసంభవ, జంగమ లింగార్చనా విశారద ! విలస, త్సంగీత శాస్త్ర పారగ, గంగోత్పత్తి ప్రకార కావ్య ధురీణా ! 3. 451.