పుట:Dvipada-basavapuraanamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxii

నియమ ముండియు ద్విపాద నియతి మాత్రమే గల ద్విపద , రగడ, అట్టి ప్రాస నియమము లేని మంజరీ ద్విపద మున్నగునవి పాటలుగాఁ బాడుకొనుట కనువగు గేయకృతు లగుటచే సంగీతమునందు వలె వానిలోఁ గూడఁ బ్రాసయతిని వాడ వచ్చు ననుటయే ప్రాచీనచ్ఛందో లక్షణకర్తల మతముగా గోచరించును. మనభాషలో గ్రంథస్థము గాక తరతరములనుండి పారంపర్యముగ జనుల నోళ్లలోఁబడి ప్రచారమం దున్న యలేఖ్య గేయ వాఙ్మయ మెంతయో యున్నది. ప్రాఁతపాట లనుపేరితోఁ గొందఱు భాషాభిమానులు వీనిని సేకరించి యిప్పు డందందుఁ బ్రకటించు చున్నారు. ఇవి చాలవఱకు ద్విపదరూపములుగనో, తద్వికృతులుగనో యుండును. వీనికాలమును నిర్ణయించుట దుస్తరము. నన్నయకు ముందునుండియు వెలసినవిగూడ నిందుఁ బెక్కులు చేరియుండును. వీనిలో నందందుఁ బ్రాసయతి గాననగును. మచ్చునకుఁ గొన్ని యుదాహరింతును.

“అత్తింటి కోడలు ఉత్తమురాలు - చేట జొన్నలు పోసి చేనిద్రపోను."
“చక్కనాన్నగారి ముక్కుపై చెమట - చేరుడేసి ముత్యాలు చెదరినట్లుండు."
“చలికి వెఱచినట్టు పులికి నే వెఱవ - ఆలికి వెఱచినట్లు అమ్మ కే వెఱవ."
“కొడుకులఁ గనని వాళ్ల కడు పేమికడుపు - కుల ముద్ధరించని కొడు కేమి కొడుకు,”

కావున నిట్టి ప్రాచీనమతము ననుసరించియే సోమనాథుఁడు ద్విపదలందు రగడలందుఁగూడఁ బ్రాసయతిని వాడి యున్నాఁడు".[1] "ప్రాసమైనను యతిపై వడియైన - దేసిగా నిలిపి యాదిప్రాసనియతి – తప్పకుండగ ద్విపదలు రచియింతు" నని యెలుగెత్తి చెప్పిన సోమనాథుని హృదయమును తమ్మయ్యగారు చక్కఁగా నావిష్కరించినారు.

బసవపురాణము నిట్లు పురాణకల్పనమునందును, వస్తుసంవిధానము నందును ఛందోనిర్వహణమునందును, భాషాప్రయోగమునందును దేశీయము లైన సంప్రదాయములను, నవీనగుణములను మేళవించి ప్రథమాంధ్ర స్వతంత్ర ద్విపద పురాణముగా సోమనాథుఁడు నిర్మించెను.

  1. బసవ పురాణము (వావిళ్ల ప్రచురణము) పీఠిక - పుట 99-102 (గౌరన రంగనాథాదులు కూడ ప్రాసయతిని క్వాచిత్కముగాఁ పాటించి రని వీరు పేర్కొని యుండిరి.