పుట:Dvipada-basavapuraanamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxiii

కవి జీవిత విశేషములు :

ప్రాచీనకవు లందఱి వలెనే పాల్కురికి సోమనాథుఁడును స్వీయ చరిత్ర నేమియు తనకావ్యములలోఁ బేర్కొనలేదు. కాని యెడనెడ నాతఁడు తననుగూర్చి చెప్పుకొనిన మాటలనుబట్టి యతనికథను మన మూహింప వలసి వచ్చుచున్నది. ఇట్లూహించుట కతని కృతులే కాక ఏకామ్రనాథుని (క్రీ.శ , 14వ శతాబ్దము) ప్రతాప చరిత్ర మను వచనగ్రంథము, పిడపర్తి సోమనాథుని (క్రీ.శ. 15వ శ.) పద్య బసవపురాణము, శైవకవియొకఁడు రచించిన అన్య వాదకోలాహల మను సీసపద్య శతకము, తుమ్మలపల్లి నారనారాధ్యుని ద్విపద బసవ విజయము, తోంటదసిద్ధ లింగకవి (క్రీ. శ. 16వ శ.) కన్నడమున రచించిన పాలకురికి సోమేశ్వరపురాణము, ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోని స్థానిక చరిత్రములు మొదలగునవి కొంత తోడుపడుచున్నవి. వీనిలో చాలవఱకు ప్రతాపచరిత్రయందు సోమునిగూర్చి చెప్పఁబడిన యంశములే పునరావృత్తము లైనవి. చారిత్రకులు వీనిని ప్రామాణికములుగా గ్రహింపరు. కాని పరంపరగా వచ్చుచున్న యీ కథలన్నియుఁ బుక్కిడి పురాణము లని త్రోసివేయుటకును వీలులేకున్నది. కావున కొందఱు విమర్శకులు కావ్యాంతర సాక్ష్యములు చారిత్రక నిదర్శనములు, శాసనాధారములు, ఆంధ్రకర్ణాటక కవిస్తుతులు మొదలగువానిని ప్రాతిపదికలుగాఁ గైకొని దాని కనువైనంతవర కీ కథార్థములను సమన్వయించుకొనుచున్నారు. ఏమైనను పాల్కురికి కవినిగూర్చి తెలిసిన పరిమిత చరిత్రలోఁ బ్రధానాంశము లన్నింటిపైనను వాదోపవాదములు వెలసి యున్నవి. వాని నన్నింటిని బేర్కొని. వాని యారంభసంరంభాదులను, వాద ప్రతివాదములను నిరూపింపఁ బూనినచో నదియు నొక పురాణము కాఁగలదు. కావున నాయంశములను దిజ్మాత్రముగా నిందు పొందుపఱచుట యైనది.

జన్మస్థలము :

గ్రామనామమే గృహనామముగాఁ గలవాఁడు పాల్కురికి సోమనాథ కవి. [1] ఆపాల్కురికి [2] తెలంగాణమున నోరుగల్లునకుఁ బండ్రెండు క్రోసుల దూరమున జనగామతాలుకాలో నున్న నేటి 'పాలకుర్తి' యనియు, అదియే కవి

  1. చాగంటి శేషయ్యగా రీవిషయము నిదమిత్థమని నిర్ణయింప వీలులే దనిరి.
  2. దీనికి పాల్కురికి, పాలుకురికి, పాలకురికి యనియు , కురికికి - కుఱికి యనియు రూపములు కలవు.