పుట:Dvipada-basavapuraanamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v

వంశ మన్వంతరములకును , రాజవంశ చరిత్రములకును ప్రాధాన్యము వచ్చినది. ఆ పైన మతప్రబోధైకదృష్టితో నిర్మింపఁబడిన పురాణోపపురాణముల యందు దేవతా మహిమాభివర్ణనాత్మకము లైన కథలును, అవతారగాథలును, మతధర్మ బోధలును, భక్త చరిత్రములును విశేషముగాఁ జోటు చేసికొనినవి. బౌద్ధులును జైనులును ఇట్టి పురాణసంప్రదాయమును కొంత పరోక్షముగా ననుసరించి జాతక కథలను, జైనపురాణములను నిర్మించుకొనిరి. వీరిలో పురాణ శబ్దమును విరివిగా వాడుకొని వాఙ్మయ నిర్మాణము చేయుటయే కాక ప్రసిద్ధ సంస్కృతేతిహాస కావ్య పురాణకథలను జైనమతానుగుణముగా మార్చి తిరుగవ్రాయుటకును వెనుకంజ వేయనివారు జైనులు. కేవలజ్ఞాన సిద్ధిచే ముక్తు లైన తీర్థంకరుల జన్మ మహిమాది విశేషములఁ బ్రతిపాదించుచు తన్మత ప్రచారానుగుణముగా నిర్మింపఁబడినవి జైనపురాణములు. ఇట్టివి సంస్కృత ప్రాకృతములందు కొన్ని వెలసి యున్నను సామాన్యజనుల కందుబాటులో నుండునట్లు వానిని జైనకవులు దేశీయ భాషలలో ననువాదము గావించిరి. ఇట్లు పురాణము పంచలక్షణవిశిష్ట మను ప్రసిద్ధినిఁ గోల్పోయి మత ప్రవక్తలను భగవన్మూర్తులుగా భావించి, భజించుటకును, తన్మతానుయాయు లగు మహాత్ముల వైశిష్ట్యమును , మహిమలను గ్రహించుటకును, పరమతఖండన, స్వీయమత పోషణానుసరణాదుల కైన పరిజ్ఞానము నందించుటకును నేర్పడిన కథాకావ్యములుగా రూపొందినవి. ఇందు చరిత్ర కందని సనాతనుల చరిత్ర లుండక పోవచ్చును. ప్రతీకాత్మక సృష్టి కనుపడకపోవచ్చును. సమకాలికులే పురాణపురుషులుగాఁ గీర్తింపఁబడవచ్చును. పురాణగౌరవము నభిలషించెడి నవీనమతముల యాకాంక్షలు నామశ్రవణమాత్రముననే పౌరాణికత్వము స్ఫురింపఁజేయు నిట్టి నవీన కావ్యలతికలకు దోహదక్రియ లొనర్చినవి.

దక్షిణ దేశభాషా సాహిత్యములలో నిట్టి పురాణములు మతవాఙ్మయముల కెత్తిన కీర్తిపతాక లై విరాజిల్లు చున్నవి. కన్నడమున ప్రసిద్ధజైనకవులు తీర్థంకరుల చరిత్రలను పురాణములుగా వెలయించిరి. 'ఆది కవి' యని ప్రసిద్ధిగాంచిన సంపకవి (క్రీ. శ. 941) జైనప్రథమ తీర్ధంకరుఁ డైన పురుదేవుని చరిత్రమును 'ఆదిపురాణ' మనుపేర చంపువుగా ననువదించెను. అది జినసేనుని సంస్కృత కృతి కనుకృతి. ఇట్లే 'ఉభయకవి చక్రవర్తి ' యైన పొన్నకవి పదునాఱవ జైన తీర్థంకరుని జీవిత చరిత్రమును చంపువుగా శాంతిపురాణ మను పేర రచించెను. 'కవిచక్రవర్తి ' రన్నఁడు ద్వితీయ తీర్థంకరుని చరిత్రను అజితపురాణ