పుట:Dvipada-basavapuraanamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi

మను పేర చంపూ గ్రంథముగా నిర్మించెను. ఇవికాక నాగచంద్రకవి మల్లినాథపురాణము, నయ సేనుని ధర్మనాథపురాణము , జన్నకవి అనంతనాథపురాణము మొదలగునవి ప్రసిద్ధ కన్నడ జైనపురాణములు. ద్రావిడవాఙ్మయమునందు అఱుపత్తు మూవురు నయనారు లను శివభక్తుల చరిత్రములను గూర్చి “శేక్కిజ్షార్ ' అను కవి రచించిన 'పెరియపురాణము' కడు ప్రసిద్ధి కెక్కి యున్నది. ఇట్లు మతాచార్యుల యొక్కయు భక్తుల యొక్కయు కథలను గుదిగ్రుచ్చి కూర్చి యొక కథాహారముగా సంతరించి పురాణ మను పేరఁ బ్రవర్తిల్లఁ జేయుట కర్ణాట ద్రవిడ కావ్యవస్తు నిర్మాణ పద్ధతులలో నొకటిగా క్రీ. శ. 10వ శతాబ్దమునుండియే గుర్తింపఁబడి యున్నదని తెలియుచున్నది. ఇది ఆర్షము, ఆద్యము నైన సంప్రదాయము కాక దేశీయము, నవీనము నైన కావ్యనిర్మాణ ప్రక్రియగా రూపొందిన దని గ్రహింప వీలగుచున్నది. బసవపురాణ మీసంప్రదాయము ననుసరించి 'పురాణాఖ్య'ను ధరించి ప్రప్రథమ వీరశైవపురాణ మై వాసి కెక్కినది. ఇట్టి రచనల కిదియే తెలుఁగున శ్రీకారము చుట్టినది.

జైనపురాణ ప్రభావము :

సోమనాథుడు జైనపురాణ సంప్రదాయముల నెఱుంగుటకు ఓరుగల్లు ప్రాంత మెంతయో తోడ్పడియుండును. ఓరుగల్లు బహువిధమతస్థుల కావాసమైన మహాంధ్రనగర మని విఖ్యాతి నందినది. నన్నయనాటికి తూర్పుచాళుక్య రాజుల వైదికమతాభినివేశముచే వేంగిదేశమున జైనబౌద్ధముల ప్రాబల్యము సడలినది. కాని తెలంగాణమున నంతగా తగ్గలేదు. అందుల కప్పు డాప్రాంతము నేలు రాజులు తూర్పుచాళుక్యులవలె వైదికమతపోషకులు కాకపోవుటయే ప్రధానకారణము. అనుమకొండలోఁ గాకతీయసామ్రాజ్యము సుమారు పదునొకండవ శతాబ్ద్యారంభముననే మొదటి బేతరాజు స్థాపించి యుండెను. అతఁడు జైన మతావలంబుఁడుగాఁ గానవచ్చుచున్నాఁడు. అతని తరువాతివాఁడగు మొదటిప్రోలరాజును జైనుఁడే. కాకతీయ ప్రభువులలో మొట్టమొదట శైవము నవలంబించిన వాఁడు రెండవబేతరాజు. అతఁడు పరమమాహేశ్వరుఁడని కీర్తింపఁబడినాఁడు. అతఁడు 11వ శతాబ్ది చరమపాదమునఁ బాలనకు వచ్చినవాఁడు. అప్పటినుండియు నోరుగల్లున శైవమునకు ప్రాబల్య మేర్పడినది. అది శైవమైన మతముల సంఘర్షణములకు దారి తీసినది. గణపతిదేవ చక్రవర్తి వీరశైవాచార దీక్షావ్రతుఁడగుటచే జైనులను, వారి మతమును క్రూరముగా హింసించినట్లు తెలియుచున్నది.