పుట:Dvipada-basavapuraanamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv

 విన నాపురాణంబు విధ మెట్లొకో యన్న
                 ధూర్త విప్రుం డొక కర్త చేరి

అ. పాలకురికి సోమపతితుఁ డీనడుమను
     చెనచె మధ్య (ప్రాస) వళ్లు పెట్టి ద్విపద
     యప్రమాణ మిది యనాద్యంబు పద మన్న
     నరిగె రాజు" ..... ..... ..... ......

(పీఠిక. 28 ప.)

ఇందలి విప్రుఁడు వీరశైవులను ధూర్తుఁడు కావచ్చును. కాని, యతఁడు పురాణ సంప్రదాయజ్ఞుఁడు. అతనికి పాలకురికి సోమనాథుఁడు పతితుఁడు కావచ్చును. కాని, అతఁడు దేశ సంప్రదాయము ననుసరించి పురాణము నిర్మించిన పరమ మాహేశ్వరుఁడు.

పైకథలో రాజు “ఆపురాణము విధ మెట్టి ? " దని ప్రశ్నించెను. “ఆపురాణమును సోమన యీనడుమ ప్రాసవళ్లు పెట్టి ద్విపదలో రచించె" నని విప్రుఁడు పేర్కొనెను. అది యప్రామాణిక మనియు, ననాద్య మనియు విమర్శించెను. ఈ విమర్శ ద్విపదకు మాత్రము పరిమిత మైనది కాదు. ఛందము కావ్యరచనాంగములలో నొక్కటి మాత్రమే. పురాణవిధ మనఁగా పురాణనిర్మాణవిధమును, తద్వస్తు నిర్వహణ విధమును, తల్ల క్షణ విధమును గూర్చియు ప్రశ్నించెనని భావించుటకు వీ లున్నది. కావున నావిప్రుఁడు బసవపురాణము సంస్కృతపురాణములవలెఁ గాక వేదప్రామాణ్యము లేని దనియు, అనార్హ మనియు. వానివలెఁ బ్రాచీనము కా దనియు, నవీన మనియు విమర్శించె నని గ్రహింప వచ్చును. ఈ లక్షణములు ప్రాచీన (మార్గ) పురాణసంప్రదాయజ్ఞునకు దోషములుగాఁ దోపవచ్చును కాని దేశి (పురాణ) సంప్రదాయజ్ఞునకు నవీనగుణములుగా స్ఫురింప వీ లగుచున్నది.

దేశిసంప్రదాయము :

పురాణ లక్షణము లన్నియు సంస్కృతపురాణము లన్నింటియందును బాటింపఁబడి యుండ లేదని విమర్శకులు భావించుచున్నారు. మహాపురాణముల విధమే యిట్లుండ వాని యుత్సవ విగ్రహము లైన యుపపురాణముల సంగతి వేఱుగాఁ జెప్పవలసిన దేమున్నది? ఏమైనను పురాణములలో నత్యంత ప్రాచీనములైన వానియందు నర్గప్రతిసర్గముల కధిక ప్రాముఖ్య ముండెడిది. క్రమముగా