పుట:Dvipada-basavapuraanamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

బసవపురాణము

“ఏమియు నే నొల్ల; నీవిష సేవ
నేమేమి వుట్టునో యే వినఁజాల ;
గ్రక్కున నుమియవే కాలకూటంబు
నిక్కంబు నా కెక్కెనీయీవి.” యనిన
దశనకాంతులు దశదిశలఁ బర్వంగఁ
బశుపతి యారుద్రపశుపతి కనియె :
“నిట లోకములలోన నెన్ననే కాక
యట మ్రింగ నుమియంగ నది యెంతపెద్ద ?
యణుమాత్ర నాకంఠమందుఁ జిక్కినది :
గణుతింప నున్నదే కాలకూటంబు 520
ఇంత సంతాపింప నేల నీ ? కనుచు
వింతన వ్వొలయంగ సంతరించుడును..
“నమ్మంగఁ జాలఁ బినాకి ! యివ్విషము
గ్రమ్మన నొక్కింత గడుపు సొచ్చినను
బెద్దయుఁ బుట్టునో పిమ్మటివార్త
దద్దయు విన నోపఁ దా ముస్న చత్తు
సమయని మ్మొండేనిఁ జావనీవేని
యుమియు మివ్విషమొండె నొండు సెష్పకుము
తక్కినమాటలు దనకింప" వనుచు
నిక్కంబుతెగువమై నిష్ఠించి పలుక ; 530
'నుమియ కుండినఁ జచ్చునో ముగ్థ' యనుచు
నుమబోటి యాత్మలో నుత్తలపడఁగ
“నుమిసినఁ గొని కాల్చునో తమ్ము" ననుచుఁ
గమలాక్షముఖ్యులు గడగడ వడఁకఁ
బ్రమథు లాతని ముగ్ధభక్తికి మెచ్చి
యమితమహోత్సవు లై చూచుచుండ
నొక్కింత నవ్వుచు నుడురాజధరుఁడు
గ్రక్కున లేనెత్తి కౌఁగిటఁ జేర్చి,
“ప్రమథులయాన నీపాదంబులాన