Jump to content

పుట:Dvipada-Bagavathamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాకతీయ గణపతిరాజు క్రీ.శ. 1200 మొదలు 1260 వఱకును రాజ్యపరిపాలన చేసెను. దీనినిఁ బట్టి శ్రీ వీరేశలింగము పంతులుగారు తరమునకు నలుబదేసి సంవత్సరముల చొప్పున నేర్పఱచి కందనమంత్రికాలమును 1420 గా లెక్కవేసిరి. 1420వ సంవత్సరమునఁ బద్మపురాణమును గందనమంత్రి కృతినందుట దీనికి సరిపోయినది.

మడికి సింగనార్యుఁడు తాను మొదట రచించిన పద్మపురాణ భాగవతదశమ స్కంధములను నరాంకితము చేసెను. కాలక్రమమున నతని చిత్తవృత్తి దైవపరాధీనమగుట బట్టి కాఁబోలును దన మూఁడవ కృతియగు వాసిష్ఠరామాయణమును అహోబలస్వామి కంకితమొనర్చెను. తనకు ముందుండిన నన్నయాది యాదిమ కవీశ్వరుల యాచారము ననుసరించి కృత్యాదిని గీర్వాణభాషాబద్ధమగు శ్లోకమును వేసుకొనెను. వాసిష్ఠరామాయణము యొక్క ఆదిమ శ్లోకమును చూడుడు. 

“శ్రీమద్దివ్యమునీంద్రచిత్తనిలయం సీతామనోనాయకం
 వల్మీకోద్భవ వాక్పయోధిశశినం స్మేరాననం చిన్మయం
 నిత్యం నీరదనీలకాయ మమలం నిర్వాణ సంధాయినం
 శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రంభజే. ”

ఇవిగాక మడికి సింగనార్యుఁడు “సకలనీతిసమ్మత” మను నీతిశాస్త్రమును రచియించెను. సకలనీతిసమ్మతమును శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు ప్రచురించినట్లు తెలియుచున్నది. దీనిలోని కొన్ని పద్యములను కీర్తిశేషులైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, ఈ గ్రంధాలయము తరఫున మద్రాసు ప్రభుత్వసహాయముచేఁ బ్రచురింపఁబడిన “ఆంధ్రకామందుకము” యొక్క వీఠికలో నుదహరించి యున్నారు.