పుట:Dvipada-Bagavathamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ విధముగా సంస్కృతాంధ్రములందసాధారణ పాండిత్యము కలవాఁడును, నీతి వేదాంతశాస్త్రము లందభిరుచి కలవాఁడును, మహాకవియు నగు మడికి సింగనార్యుని ప్రభావంతమైన అమృతవాహిని యగు లేఖిని పండిత పామర రంజక మగు ద్విపదలచే భక్తజనమందార మగు భాగవత దశమస్కంధమును రచించి, ఆంధ్రసారస్వతమునకు మహత్తర మగు సేవ యొనరించినది!

——: పరిష్కరణ — కథా విభాగము: —

తంజావూరు సరస్వతీమహల్ లైబ్రెరీ నెం 150 తాళపత్రప్రతి, ఈ పరిష్కరణకు మాతృకయై యున్నది. ఇట్టి ప్రతిగాని, ఇతోధికప్రతిగాని వేఱే ఎచ్చటను లేనందున నేను గావించిన సంస్కరణము పూర్తిగా నీతాళపత్ర ప్రతిపైననే యాధారపడి యున్నది. దీనియందు 180 తాళపత్రములున్నవి. వ్రాత సుమారుగా నున్నను, తప్పులు విశేషముగా దొర్లియున్నవి. అక్రూరుడు శ్రీకృష్ణభగవానుని స్తుతించు ఘట్టమునుండి యారంభమగుచున్నది. మొదటి నాలుగు పత్రములు కీట దష్టములు: అక్షరముల యాకారము బొత్తిగా నశించియున్నది.

కవి భాగవత దశమస్కంధము యొక్క పూర్వోత్తర భాగములను కాండ సంజ్ఞలతో విభజించుకొని యున్నాడు. దశమస్కంధపూర్వభాగము కంసుడు తన చెల్లెలు దేవకిని వసుదేవునితోఁ గలిపి రథారూడులఁ జేసి మంగళతూర్యనినాద వైభవములతో భర్తృగృహమునకుఁ దానే సారథియై రథమును నడుపుటతో నారంభించుచున్నది. తరువాతి కథయగు నాకాశవాణి కథనము, శ్రీకృష్ణావతార ఘట్టము, నందగోపుని యింట శ్రీకృష్ణుని