పుట:DivyaDesaPrakasika.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరి మనవంటి వారికి భగవదర్శన సాదనమే లేదా? అనినచో, ఏలలేదు? మన కొఱకే గదా భగవంతుడు అర్చావతారమును దాల్చి శ్రీరంగం, తిరుమలై, కాంచీపురం, తిరునారాయణపురం, బదరికాశ్రమం, సాలగ్రామం మొదలైన దివ్య క్షేత్రములలో అర్చారూపముతో వేంచేసియున్నాడు. మన రాకను ప్రతీక్షించుచున్నాడు. దర్శించిన చాలును తప్పక అనుగ్రహించును. తిరుమలైలో ఇది మనకు అనుభవసిద్దము గదా. ఈ నాడు ప్రయాణ సౌకర్యములు ఎంతగానో అభివృద్ది చెందియున్నవి. అదృష్టవంతులెందరో పలు పర్యాయములు ఈ దివ్యక్షేత్రములను దర్శించి తరించినవారున్నారు.

ఒకనాడు ఈ క్షేత్రములను దర్శించుట దూర దేశస్థులకు చాల శ్రమ సాధ్యముగా ఉండెడిది. "కాశికి పోయినవాడు కాటికి పోయినవాడితో సమానం" అనేమాట మనం వింటూనే ఉంటాం. ఆళ్వారులయందును వారి దివ్యప్రబంధముల యందును అత్యంత ప్రావణ్యం గల ఉ.వే.శ్రీమాన్ గోపాలకృష్ణామాచార్య స్వామివారు తమ డెబ్బదియవ సంవత్సరమున దక్షిణ దివ్యదేశ యాత్రకు సకుటుంబంగా బయలుదేరినారు. ఆ సందర్బంలో అనుగ్రహించినదే ఈ స్తోత్రం. ఈస్తోత్రంలో నూట ఎనిమిది దివ్యదేశాల పేర్లు అక్కడ వేంచేసియున్న స్వామి పిరాట్టి (అమ్మవారు) తీర్థము విమానము మున్నగు వాని పేర్లతో బాటు ఏయే ఆళ్వారులు ఆస్వామిని కీర్తించినది తెల్పుచు ఒక్కటి రెండు మూడు శ్లోకములలో అతిమనోహరముగను భక్తిరస భరితముగను స్తుతించినారు. ఈస్తోత్రమును ఒకమారు చదివినా ఆక్షేత్రాలను దర్శింపవలయునను ఉత్కటమైన కోరిక పాఠకులకు కలుగును. సందేహంలేదు.

శ్రీమాన్ గోపాలకృష్ణమాచార్య స్వామివారు తమ చివరి దశలో వ్రాసిన దగుటచేత ఈస్తోత్రము ముద్రణ కాలేదు. శ్రీస్వామివారు తిరుపతిలోని, వారి వియ్యంకుడుగారైన ఉ.వే.శ్రీమాన్‌నమ్మయ్యాస్వామివారి తిరుమాళిగలో (నాధమునివీధిలో) 1932 సంవత్సరమున పరమపదించినారు. తిరువేంగడముడైయాన్ తన తిరువడిఘళ్ళ చెంతనే వారికి పరమపదమును ప్రసాదించినారు.

వీరు పరమపదించి 60 సంవత్సరములు పూర్తి అయిన సందర్బంగా 1992 సంవత్సరమున వీరి అముద్రిత రచనలను ముద్రింప సంకల్పించి ఆ ప్రయత్నంలో ఉండగా శిథిలావస్థలో ఉన్న ఈ స్తోత్రము యొక్క వ్రాతప్రతి దర్శనమిచ్చినది. దీని వైశిష్ట్యమును గుర్తించి మూలమును ఆంధ్రమున దాని వివరణమును-ఆయా దివ్యదేశములలోని అర్చామూర్తులయొక్క ఒరిజినల్‌కలర్‌చిత్రములను, ఈమూర్తులను ఏయే ఆళ్వారులు ఎక్కడెక్కడ ఎన్నిన్ని పాశురములను(గేయములను) అనుగ్రహించినది ఆ వివరమును ఆయా క్షేత్రాదులకు గల ప్రయాణ సౌకర్యాది వివరణలతో సహా ముద్రించుచున్నాము. ఇది దివ్య దేశ సర్వస్వమనుటలో అతిశయోక్తిలేదు. ఇంత వరకు ఇట్టి గ్రంథము ఆంధ్రమున ముద్రింపబడలేదు అనుట నిస్సంశయము. పాఠకులు ఆదరింతురు గాక.

భవదీయుడు

యన్.వి.యల్.యన్.రామానుజాచార్యులు