పుట:DivyaDesaPrakasika.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయ నమ:

విజ్ఞప్తి

ఆర్య,

"దివ్యదేశ వైభవ ప్రకాశిక" యను ఈ విలక్షణమైన స్తోత్రమును అనుగ్రహించినవారు ఉ.వే.ప్ర.శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమాచార్య స్వామివారు. వీరు ఉభయ వేదాంత నిష్ణాతులు. వ్యాకరణ శాస్త్ర పారంగతులు. మహాకవి. బహుగ్రంధ రచయిత. వీరి తండ్రిగారైన ఉ.వే.ప్ర. శ్రీమాన్ రామానుజాచార్య స్వామివారి తదనన్తరం వీరు నీజివీడు (కృష్ణాజిల్లా) సంస్థానమున ఆస్థాన పండితులుగా నియమింపబడినారు.

వీరి రచనలలో "శ్రీశోభనాద్రీశ వైభవ చమ్పూకావ్యము" 24 వేల గద్య పద్యములతో నొప్పుచు రామాయణ భారత భాగవత కథలను రస్య రహస్యార్థ సంశోభితముగ వర్ణించుచున్నది. ఇది నూజివీడు సంస్థానాధిపతులచే నాలుగు భాగములుగ ముద్రింపబడి ఆంధ్రదేశమున విస్తృత ప్రచారమును పొందినది. ఇట్లే వీరి "శ్రీభగవద్రామానుజార్య దివ్యావతరోత్సవ వర్ణన కావ్యము" "శ్రీఆదికేశవ బ్రహ్మోత్సవ వర్ణన కావ్యము" ఆధ్యాత్మిక వ్యాసమాల" ముద్రితములై నేడు ప్రచారములో నున్నవి.

వీరి రచనలలో దివ్యదేశవైభవ ప్రకాశిక అను ఈ స్తుతి కావ్యము మరుగున పడిన మాణిక్యము వలె ఇంతకాలము ముద్రణ భాగ్యము నందక పోవుటచే పాఠకులకు అందుబాటులో లేకుండినది. ఆలోటును తీర్చుటకై ఆంధ్ర వివరణలతో ఈ స్తోత్రమును ముద్రింప సంకల్పించినాము.

దక్షిణ దేశమున "ఆళ్వారులు" అని సుప్రసిద్దులైన శ్రీవిష్ణు భక్తులు భక్తి పారవశ్యంతో భగవంతుని కీర్తించిన గేయ సంపుటిని నాలాయిర దివ్య ప్రబంధమని యందురు. ఈ గేయములు ద్రవిడ భాషలలో అతి ప్రాచీనమైన తమిళ భాషలో నున్నవి. "ద్వాదశ సూరులు" అని ప్రసిద్ధి గాంచిన ఈ ఆళ్వారులు వారి సమకాలమున యావద్బారతమునందు ప్రఖ్యాతి గాంచియున్న నూట ఎనిమిది దివ్య క్షేత్రములలో గల విష్ణు మూర్తులను తమ గేయములలో ప్రస్తుతించినారు. శ్రీవైష్ణవులు నేటికిని ఆ నూట ఎనిమిది దివ్య క్షేత్రములను పరమ ప్రాప్యములనుగా భావించి జీవితంలో ఒక్కమారైనా వాటినన్నింటిని దర్శింపవలయునని ఉవ్విళలూరుచుందురు.

అనన్త గరుడ విష్వక్సేనాది నిత్యసూరులు ముక్త పురుషులు పరమపదనాథుని సదా దర్శించి స్తుతించుచు ఆనందింతురు. యోగులు తమతమ హృదయములలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను దర్శించి ఆనందింతురు. దేవతలు క్షీరాబ్దిశాయిని సేవించి తమ బాదలను తొలగించుకొని ఆనందింతురు. భగవంతుని రామకృష్ణా ద్యవతారములను సమకాలములో నున్నవారు వారిని దర్శించి సేవించి ధన్యులైనారు.