పుట:DivyaDesaPrakasika.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వారములు) శ్రీనివాస పెరుమాళ్, పెరియవాచ్చాంబిళ్లై సన్నిధి. ఈ ప్రాకారములోనే కలవు.

ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీ రంగనాధులు కొలువు తీరు వేయి కాళ్ల మండప మీప్రాకారములో కలదు. దీనికి "ఆయిరం కాల్ మండపమని" పేరు. (సహస్రస్థూణా మండపం) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.

ఇచట గల శేషరాయన్-మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామన్ సన్నిధి కలవు. దాని ప్రక్కన పిళ్ల లోకాచార్యుల వారి సన్నిధి, వారి సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారది సన్నిధి కలవు.

ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (భగవద్రామానుజులు) సన్నిధి. ఇచట ఉడయవర్ "తానానా" తిరుమేనిగా వేంచేసియున్నారు (తానేయైన తిరుమేని) ఇది పూర్వము వసంత మండపము. ఇచట వేంచేసి యున్న ఉడయ వరులు సేవించువారి హృదయమున వేంచేసి యుందురని మణవాళ మామునులు అభివర్ణించి యున్నారు. ఈ సన్నిధిలో ఆళవందార్ పెరియనంబి వేంచేసి యున్నారు. స్వామి తిరువారాదన యగు తేవ ప్పెరుమాళ్ (వరదరాజస్వామి) సన్నిధి ప్రక్కన వేంచేసి యున్నారు. ప్రతి దినం ఉదయం 9 గంటల ప్రాంతమున స్వామి సన్నిధిలో సేవ శాత్తుముఱై జరుగును.

ఇంకను ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి సన్నిధి, విఠల్ కృష్ణన్ సన్నిధి, తొండరడిప్పొడియాళ్వార్ సన్నిధి కలవు.

ఐదవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి యనిపేరు. మకర (తై) మీన (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాధులు ఈ వీధులలో వేంచేయుదురు. మకరమాస పుష్యమీ నక్షత్రమున నంబెరుమాళ్లు ఉభయనాచ్చిమార్లతో తిరిత్తేరుపై వేంచేయుదురు.

ఈ ప్రాకారములో ఉత్తమనంబి, తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్యపురుషుల తిరుమాళిగలు మణవాళమామునుల సన్నిధి కలవు.

ఆరవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "చిత్రవీధి" యనిపేరు. మేషమాస (చిత్రి) బ్ర్హహ్మోత్సవమున నంబెరుమాళ్లు ఈ వీధులలో వేంచేయుటచే ఈ వీధికి "చిత్రవీధి" యని పేరు వచ్చెను. ఆళ్వారాదులు తిరునక్షత్రముల యందు ఈ తిరువీధులలో వేంచేయుదురు.

ఉత్తర మాడ వీధిలో వేధాంత దేశికర్ సన్నిధి, దీనికి ప్రక్క జగన్నాధన్