కావుననే మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ" అని అనుసంధానము చేతురు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము. భోగ మండపము, త్యాగ మండపము; పుష్ప మండపము; జ్ఞాన మండపములుగా ప్రసిద్ధి చెందిన నాల్గు క్షేత్రములలో శ్రీ రంగము భోగ మండపము. 2. తిరుమలై- పుష్ప మండపము. 3.కాంచీపురము-త్యాగ మండపము.4. తిరనారాయణపురము - జ్ఞాన మండపము.ప్రణవాకార విమానములో శ్రీ రంగ నాధులు శయనతిరుక్కోలమున వేంచెసియున్న తీరు అత్యద్బుతము. మరియు సర్వేశ్వరుడు స్వయముగా నవతరించిన యెనిమిది క్షేత్రములలో ప్రధానమైనది శ్రీరజ్గము.
స్వయం వ్యక్త క్షేత్రములు
1. | శ్రీరంగము | శ్రీరంగనాదులు |
2. | శ్రీముష్ణము | భూవరహ పెరుమాళ్ |
3. | తిరుమలై | తిరువేంగడముడై యాన్ |
4. | తిరునీర్మలై | శ్రీరంగనాధన్(నీర్వణ్ణన్) |
5. | నైమిశారణ్యం | దేవరాజన్(వనరూపి) |
6. | పుష్కరమ్ | పరమపురుషన్(తీర్దరూపి) |
7. | బదరికాశ్రమం | తిరునారణన్ |
8. | సాలగ్రామం | శ్రీమూర్తి |
వై వస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపము గావించెను. బ్రహ్మ ప్రీతుడై తన ఆరాదనయగు శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించెను. ఆ తిరువారాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుల వరకు వచ్చెను.
శ్రీ రామ పట్టాభిషేకానంతరము విభీషణులు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల లేకుండిరి. ఆ సమయమున శ్రీరామచంద్రులు తమకు మారుగ తమ తిరువారాదనయగు శ్రీరంగనాథుని విభీషణాళ్వాన్లకు ప్రసాదించిరి. విభీషణులు సంతుష్టాంతరంగులై లంకకు పయనమైరి.
ఈ విధముగా లంకకు పయనమైన శ్రీరంగనాథులు ఉభయ కావేరి మధ్య భాగమును చేరిరి. విభీషణులు స్వామిని అక్కడ వేంచేపు చేసి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చిరి. ఇంతలో శ్రీరంగనాథులు ప్రణవాకార విమానమున అక్కడనే వేంచేసి యుండుట చూచి విభీషణాళ్వార్ మిక్కిలి ఖేద పడిరి. అంత శ్రీరంగనాథులు వారిని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణాళ్వార్లచే తిరువారాధన పొందునట్లు వరమనుగ్రహించిరి.