Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చోళదేశీయ దివ్యదేశములు

1. శ్రీ రంగమ్‌ - 1

శ్లో. కావేరి పరిపూత పార్శ్వ యుగళే పున్నాగ సాలాంచితే
   చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుగతే రంగాభిధానే పురే|
   వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్య శృంగోజ్జ్వలే
   దేవం ధర్మదిశా ముఖం ఫణిశయం శ్రీ రజ్గనాధం భజే||

శ్లో. శ్రీ ధర్మ వర్మ రవివర్మ నిషేవితాజ్గ:
   శ్రీరజ్గిణీ చటుల విభ్రమ లోల నేత్ర:|
   నీళా సరస్యముఖ సూరి వరేణ్య గీతి
   పాత్రం విరాజితి విభీషణ భాగధేయ:|

వివరణ:-శ్రీరజ్గనాధుడు(నంబెరుమాళ్), శ్రీ రజ్గనాయకి, ఉభయ కావేరులు; చంద్రపుష్కరణి, ప్రణవాకార విమానము; దక్షిణ ముఖము; భుజంగ శయనము; ధర్మవర్మకు; రవివర్మకు; విభీషుణనకు ప్రత్యక్షము. ఆళ్వార్లు అందరు కీర్తించిన తిరుపతి. అంతరంగిక కైంకర్య పరులు తిరుప్పాణి ఆళ్వార్.

ఉత్సవములు:-మకరం పునర్వసు; కుంభం శుద్ద ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి అవసాన దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగును. ధనుశ్శుద్ద ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగును.


విశేషము:_ శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.


శ్లో. కావేరి విరజా సేయం వైకుంఠం రంగమందిరమ్|
   సవాసుదేవో రంగేశ: ప్రత్యక్షం పరమం పదమ్||

ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూల కందమగునట్లు అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూల కందము.