Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమలై నంబి

(శ్రీ శైలపూర్ణులు)

తిరునక్షత్ర తనియన్:-
    శ్రీ మల్లక్ష్మణయోగీంద్ర శ్రీ రామాయణ దేశికమ్‌|
    శ్రీ శైలపూర్ణం వృషభ స్వాతి సంజాత మాశ్రయే||
నిత్యతనియన్:-
    పితామహప్యాపి పితామహాయ
    ప్రాచేతపా దేశ ఫలప్రదాయ
    శ్రీభాష్యకారోత్తమ దేశికాయ
    శ్రీ శైలపూర్ణాయ నమో నమస్తాత్||

వీరు విశ్వక్సేసుని పరివారములోని సుముఖుని అంశతో నవతరించిన మహనీయులు. వృషభ మాసమున చిత్రానక్షత్రమున ప్రసిద్ధ దివ్యదేశమున "తిరుమలై" శ్రీనివాసుని వరప్రసాదిగా నవతరించుటచే వీరికి తిరుమలై నంబియను తిరునామమేర్పడినది. శ్రీ శైలపూర్ణులనునది నామాంతరము. వీరికుమారులు పిళ్లై తిరుమల నంబిగారు.

వీరు ఆళవందారుల శ్రీపాదములాశ్రయించి సకల వేదాంతార్దములను అధికరించిరి. "వేంగడత్తై ప్పతియాక వాల్‌వీర్ కాళ్" అనునట్లు శ్రీవేంకటాచలపతినే దారకముగా భావించి సదా స్వామి కైంకర్యము నందే నిమగ్నులైన మహనీయులు.

వీరికి తోడబుట్టిన సోదరీమణులిరువురు. వారిలో పెద్దవారు శ్రీ భూమి పిరాట్టి(వీరికే కాంతిమతీ దేవియనిపేరు) కుమారులే భగవద్రామానుజులు. రెండవవారగు పెరియపిరాట్టి కుమారులు ఎమ్బార్ అనే గోవిందభట్టర్, శిరియగోవింద ప్పెరుమాళ్.

వీరిలో ఎమ్బార్ మతాంతర ప్రవిష్ఠులుకాగా వారిని దిద్దుబాటు చేసి శ్రీవైష్ణవ సిద్దాన్త ప్రవర్తకులుగా తీర్చిదిద్దిరి. భగవద్రామానుజులకు శ్రీరామాయణ రహస్యములను ఒక సంవత్సరకాలము అనుగ్రహించిరి.

వీరు తిరుమలై శ్రీనివాసునకు తీర్థ కైంకర్యము చేయు సమయము నందొకనాడు శ్రీనివాసుడు వృద్ద బ్రాహ్మణుని రూపమునవచ్చి తాతా! దాహముగా నున్నది తీర్థమునిమ్మని కోరి వీరిచ్చిన తీర్థమును స్వీకరించిరి. ఈ సందర్బములో శ్రీనివాసుడు తాతా! అనిపిలుచుటచే వీరు పితామహులకు కూడ పితామహులైరి. వీరి వైభవము గురుపరంపరా ప్రభావములో సేవింపవచ్చును.

211