Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయనమ:

ఆళ్వార్ల వైభవము

1 పొయిగై యాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-

    తులాయాం శ్రవణేజాతం కాంచ్యాం కాంచన వారిజాత్
    ద్వాపరే పాంచజన్యాంశం సరోయోగిన మాశ్రయే ||
నిత్య తనియన్:-
    కాంచ్యాం సరసి హేమాబ్జే జాతం కాసారయోగినామ్‌|
    కలయే యశ్శ్రియ: పత్యూ రవిన్దీప మకల్పయత్||

వీరు ద్వాపర యుగాది 8,60,900 సంవత్సరమైన సిద్ధార్ది నామ సంవత్సర అల్పిశి(తుల)నెల శుద్ధ అష్టమీ జయవారం (మంగళ) శ్రవణా నక్షత్రమందు కాంచీపురం యథోక్తకారి సన్నిధి యందుగల పుష్కరణిలో స్వర్ణమయమైన తామర పుష్పమునందు అయోనిజులై అవతరించిరి. వీరికి సరో యోగి యనియు, కాసారయోగి యనియు నామాంతరములు. ఆచార్యులు సేనముతలియార్.

వీరు పాంచజన్యాంశ సంభూతులు. వీరు నిస్పృహులై గ్రామైక రాత్రముగా తిరుగుచు భగవద్గుణానుభవమే ధారక పోషక భోగ్యములు కాగా వేంచేసియుండిరి. ఒకనాడు "తిరుక్కోవలూర్" అను దివ్యదేశము వేంచేసి పెరుమాళ్లకు మంగళాశాసనము చేసి ఒక తిన్నెమీద వేంచేసి యుండగా పూదత్తాళ్వార్ వేంచేసినారు. అపుడు ఇద్దరును కూర్చుండిరి. కొంతసేపటికి పేయాళ్వార్లు అక్కడకు వేంచేసిరి. ముగ్గురకు కూర్చుండుటకు స్థలము లేకుండుటచే నిలుచుండిరి. వీరి సంశ్లేషమును గోరిన సర్వేశ్వరుడు వీరిమధ్య ప్రవేశించెను.

నిలిచియుండుటకును స్థలము చాలనందున వారు అందుకు కారణమేమా! యని యోగ దృష్టిచే చూడగా శ్రియ:పతి సాక్షాత్కరించెను. అపుడు వారి అనుభవ పరీవాహరూపముగా అవతరించిన దివ్య ప్రబన్దములే ముదల్ తిరువన్దాది, ఇరండాం తిరువన్దాది, మూన్ఱాం తిరువందాదులు. ప్రతిపాశురాంతపదము పాశురాది యందు వచ్చుటచే ఈ ప్రబంధములకు అన్దాది యని పేరు కలిగెను.

ఆళ్వార్-పొయిగై యాళ్వార్. తిరునక్షత్రం: తుల-శ్రవణం

తిరువవతారస్థలం: కాంచీ తిరువెஃకా(యథోక్తకారి సన్నిధి) పొయ్‌గై పుష్కరిణీ యందలి స్వర్ణ కమలము.

                                             181