పుట:DivyaDesaPrakasika.djvu/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది ప్రసిద్ధనగరము. ఇచట గల లక్ష్మీనారాయణ మందిరము, శ్రీరంగనాథస్వామి సన్నిధి సేవింపవలెను. ధనుర్మాసము మిక్కిలి వైభవముగా జరుగును. ఈనగరములోనే గల సీతారాంబాగ్‌లోను ప్రాచీనమైన లక్ష్మీనారాయణుల సన్నిధి, వరదరాజస్వామి సన్నిధి కలదు. ఎందరో మహానీయులు ఇచటకు వేంచేసి మంగళా శాసనం కృపచేసిన స్థలము.బిర్లాసంస్థ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి మనోహరమైనది

ఈనగరములోనే మరియొక సన్నిధి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి. ఇది ఆల్వాలలో కలదు.(సికిందరాబాద్-బొలారం మార్గము) దీనికి దేవుని అల్వాల అనియేపేరు. వందల సంవత్సరముల నాటి సన్నిధి శిధిలముకాగా దానిని ప్రస్తుతం పునర్నిర్మించుచున్నారు.

స్తంభాద్రి - 66

ఇది ఖమ్మం మెట్టుకు 2 కి.మీ దూరములో గలదు. ఇచటగల నరసింహస్వామి సన్నిధి ప్రాచీనమైనది. ఈస్వామి భక్తుల పాలిటి కల్పవృక్షము.

వేదాద్రి - 67

ఆంధ్రదేశమున సుప్రసిద్ధమైన నృసింహ క్షేత్రములలో వేదాద్రియొకటి. ఇచట ఒక చిన్నపర్వతముపై స్వామివేంచేసియున్నారు. చతుర్ముఖబ్రహ్మ నారదాదులకు ఈ పర్వతము మీదనే వేదపురాణాదులను ఉపదేశించెననియు వారి ప్రార్థనపై స్వామి అర్చారూపముగా ఇచటవేంచేసెనని చెప్పుదురు. కావుననే ఈపర్వతమునకు వేదాద్రియని పేరువచ్చినది.

మార్గము: హైదరాబాద్-విజయవాడ బస్సు మార్గములో జగ్గయ్యపేటకు సమీపములో కలదు.

బుచ్చిరెడ్డి పాలెం - 68

కోదండరామస్వామి-సీతాదేవి-లక్ష్మీ నృసింహస్వామి-ప్రాచీనమైన దివ్యస్థలము. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవము అతివైభవముగా జరుగును.

మార్గము: నెల్లూరుకు 15 కి.మీ దూరములో కలదు.

179