పుట:DivyaDesaPrakasika.djvu/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ|వే| శ్రీమాన్ నడదూరు వేంకట వరద కృష్ణమాచార్యస్వామివారి జేష్ఠకుమారులు ఉ|వే| శ్రీమాన్ వేంకటలక్ష్మీ నరసింహ రాఘవ రామానుజాచార్యులు గారు (తెలుగు పండితులు, పెంటపాడు) వీరు ఈ దివ్యదేశవైభవ ప్రకాశికకు చక్కని ఆంద్రానువాద వివరణను ఎంతో శ్రమపడి సమకూర్చినారు. అంతేకాక ముద్రణభారము సహితము తమ భుజస్కందముల మీదికెత్తుకొనినారు. ఇది వీరి శక్తికి మించిన పని. అయినను ధైర్యే సాహసే లక్ష్మీ: అనికదా పెద్దల సూక్తి. "యోగక్షేమం వహామ్యహమ్" అన్న శ్రియ:పతి అనుగ్రహించినాడు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములు లభించినవి. యెందరెందరో వదాన్య శిరోమణులు అడిగినదే తడవుగా అహమహమికతో ఈ పవిత్రకార్యమునకు ఉదారముగా ఆర్ధిక సహాయముగావించినారు. ఆమహనీయులకు మా కృతజ్ఞతాభివందనములను ఉభయవేధాంత సభద్వారా సప్రశ్రయముగా తెలుపుకొనుచున్నాము. ఈదివ్యదేశ వైభవ ప్రకాశికను సర్వాంగ సుందరముగా వెలుగులోనికి తెచ్చి ఆంద్ర పాఠకలోకమునకు మహోపకారము గావించిన ఉ|వే| శ్రీమాన్ యన్.వి.యల్.యన్.రామానుజాచార్యులకు అనేక మంగళాశాసనములను చేయుచున్నాము.

పాఠకులు దీనిని ఆదరించి ఆనందించి ఆనన్దింపజేయుదురుగాక.

శ్లో|| శ్రీరంగ మంగళమణిం కరుణా నివాసమ్|
    శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘమ్||
    శ్రీహస్తి శైల శిఖరోజ్జ్వల పారిజాతమ్|
    శ్రీ శం నమామి శిరసా యదు శైల దీపమ్||

శ్లో|| ప్రాచ్యాం దేవం జగన్నాథం భుక్తిముక్తి ప్రదాయకమ్|
    సకృత్ప్రపన్నాభయదం అవాచ్యాం సేతుమాధవమ్||
    ప్రతీచ్యాం ద్వారకాదీశం శరణాగత రక్షకమ్|
    ఉదీచ్యాం బదరీనాథం నమామ్యష్టాక్షర ప్రదమ్||