Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయనమ:

కృతజ్ఞతా నివేదనము

                       శ్రీమతేవాప్త కామాయ కల్యాణగుణ సింథవే
                       బంధవే సర్వలోకానాం కేశవాయ నమో నమ:

మా పితామహ పాదులు ఉ.వే.శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమాచార్యస్వామివారు. వీరనుగ్రహించినదే ఈ "దివ్యదేశ వైభవ ప్రకాశిక. ఇది 1931-32 ప్రాంతములో రచింపబడినది. శిధిలావస్థకు చేరిన ఈస్తోత్రమును తిరిగివ్రాసి సంరక్షించినవారు మా తండ్రిగారు ఆచార్యులునగు ఉ.వే.శ్రీమాన్‌నడాదూరు వేంకట వరదకృష్ణమాచార్యస్వామివారు. వీరు ఉ.వే.శ్రీమాన్‌గోపాల కృష్ణమాచార్య స్వామివారి పుత్రరత్నము. నడాదూరు వంశమునకు దత్తులు.

స్వామివారు ఈస్తోత్రముతో పాటు గచ్చత్ వ్యాఖ్యను కూడ అనుగ్రహించి యున్నారు. కాని అది శిదిలమైనది. మాతండ్రిగారు దీనిని తిరిగి వ్రయునపుడు చివరలో "యావల్లబ్దం తావదలేఖి" అని వ్రాసికొనియున్నారు.

ఆవ్రాతప్రతియు శిధిలావస్థకు చేరగా దానిని తిరిగివ్రాసి మా అన్నగారును కాలక్షేప ఆచార్యులునగు ఉ.వే. శ్రీమాన్ కిడాంబి శ్రీనివాస రామానుజాచార్యుల వారికి చూపించితిని. వారు దీనిని పరిశీలించి ఆంద్ర వివరణతో ప్రకటించిన మిక్కిలి ఉపయోగకరముగా నుండునని కొన్ని సూచనలతో దాసుని ఆదేశించిరి. వారి ఆదేశానుసారము దీనికి ఆంద్రవివరణాదులను కూర్చితిని. నాయీ ప్రయత్నమును కవిశాబ్దికకేసరి ఉ.వే.శ్రీమాన్ న.చ రఘునాథాచార్యస్వామివారికి విన్నవింపగా వారు "జగదాచార్య ఉ.వే.శ్రీమాన్ కాంచీ ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్యస్వామివారను గ్రహించిన "అష్టోత్తరశత దివ్యదేశస్తుతిని"కృపచేసినారు. దీనిని ప్రచురించుటకు ఉ.వే.శ్రీమాన్ ప్రతివాది భయంకరం రాజహంసస్వామి అనుమతిని కృపచేసినారు. వారికి మాకృతజ్ఞతలు.

ఈ ప్రయత్నములోనే దివ్యస్థలాదర్శమను ప్రాచీన కోశమొకటి లభించినది. ఈరెండు స్తోత్రములను దీనికి అనుబంధముగా చేర్చితిమి.

నూటయెనిమిది దివ్యదేశములను అనునిత్యము అనుసంధించుకొనుటకు వీలుగా "దివ్యదేశస్తుతి" అర్చనకు ఉపయుక్తముగా అష్టోత్తర శత దివ్యదేశ శతనామస్తోత్రమును కూడా కూర్చితిమి.